KCR reply to SIT notice : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ శుక్రవారం విచారణకు హాజరు కావడం లేదు. ఈ మేరకు సిట్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. బాధ్యతగల పౌరుడిగా.. మాజీ సీఎంగా విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఉన్న పళంగా శుక్రవారమే విచారణకు హాజరు కావాలంటే కాలేనని అన్నారు. విచారణను వాయిదా వేయాలని.. మునిసిపల్ ఎన్నికల తరవాత ఓ తేదీని నిర్ణయించాలన్నారు. అప్పుడు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలని విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ల బిజీ.. హాజరుకావడం అసాధ్యం
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (జనవరి 30న) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలన్న జూబ్లీహిల్స్ ఏసీపీ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, రేపు (శుక్రవారం) 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నామినేషన్లు వేయడానికి చివరి రోజని ఆయన గుర్తు చేశారు. పార్టీ తరపున అభ్యర్థులకు బి-ఫారాలు, ఇతర అధికారిక అనుమతులు ఇచ్చే ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని, కాబట్టి శుక్రవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పోలీసు అధికారులు తమకు అనుకూలమైన మరో తేదీని ఖరారు చేయాలని కోరారు.
సెక్షన్ 160 CrPC గురించి చెప్పిన గులాబీ బాస్
ఈ సందర్భంగా కేసీఆర్ చట్టంలోని నిబంధనలను పోలీసులకు గుర్తు చేశారు. 65 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు లేదా దివ్యాంగులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని, వారి నివాస స్థలంలోనే విచారించాలని సెక్షన్ 160 CrPC స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు. తాను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం, ఎర్రవల్లిలోని ఇంటి నంబర్ 3-96 తన నివాసంలోనే ఉంటున్నానని, చట్ట ప్రకారం అక్కడికే వచ్చి తనను విచారించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నోటీసులు ఏవైనా ఉంటే ఎర్రవల్లి చిరునామాకే పంపాలని సూచించారు.
పూర్తి సహకారం అందిస్తా.. కానీ చట్టబద్ధంగా!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా, దేశ బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. విచారణ ఎక్కడ జరగాలనే విషయంలో చట్టపరమైన పరిమితులేమీ లేవని, కాబట్టి తన నివాసంలోనే విచారణ జరపడం సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు బంతి పోలీసుల కోర్టులోకి వెళ్లింది. కేసీఆర్ లేఖపై స్పందిస్తూ సిట్ అధికారులు ఎప్పుడు ఎర్రవల్లికి వెళ్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
