Amit Shah : పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా ఆదివారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. చేవెళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్ చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, అధికార బీఆర్‌ఎస్ నుంచి కీలక నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కూడా ఈ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు.
తెలంగాణలోనూ పూర్తి మెజార్టీ సాధిస్తామని ఢిల్లీలో అమిత్ షా ధీమా
కర్ణాటకతో పాటు తెలంగాణలో సైతం పూర్తి మెజార్టీతో గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన...ఈ ఏడాదే దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పర్యటన షెడ్యూల్‌లో అమిత్ షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా కేటాయించారు. నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
ఆస్కాం టీంకు హైదరాబాద్‌లో విందు ఇవ్వనున్న అమిత్ షా
అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీంతో సమావేశమవుతారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా నటీనటులను సత్కరించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు చేవెళ్ల సభకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్ షా చేవెళ్ల బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లి బయల్దేరి వెళతారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అప్పటికి పూర్తి స్థాయిలో చేరికల వ్యూహాలను కూడా ఖరారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరనున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరికకు ఆసక్తిగా ఉన్నా.. వారిపై ప్రజా వ్యతిరేకత ఉండటంతో చేర్చుకునే విషయంలో సందిగ్ధంలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది.