Posters Against PM Narendra Modi: తెలంగాణలో మరోసారి పొలిటికల్, పోస్టర్ వార్ మొదలైంది. ఈ సారి ఏకంగా ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్ల ద్వారా నిరసన తెలిపారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయమై జరిగిన అన్యాయంపై ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు. తెలంగాణ మీద మోదీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు.



తెలంగాణ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ మరికొన్ని చోట్ల పోస్టర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. తెలంగాణ పుట్టుకను పదే పదే పదే అవమానిస్తున్న మోదీకి తెంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. What happened Modi అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు ద్వారా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది.? పసుపు బోర్డు ఎక్కడ.? మీ హామీలు అన్ని నీటి ముట‌లేనా అంటూ ప్లెక్సీలలో ప్రశ్నించారు. రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, మిషన్ భగీరథ నిధులు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. పోస్టర్లపై బీజేపీ శ్రేణులు స్పందించాల్సి ఉంది. 


మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణలో పోస్టర్లు వెలియడం కొత్తేం కాదు. ఆయన తెలంగాణలో పర్యటించిన ప్రతి సారి పోస్టర్లు వెలుస్తున్నాయి. తెలంగాణకు అన్యాయం చేశారంటూ, నిధులు కేటాయించడం లేదని, తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న అమిత్ షా పర్యటన సందర్భంగా పలు పోస్టర్లు వెలిశాయి. మార్చి, ఏప్రిల్, జూన్, ఆగస్టు నెలల్లో ప్రధాని రాకను ప్రశ్నిస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆగస్టు చివరి వారంలో వరంగల్‌లో ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్‌ పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి.


తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ‘నేను వరంగల్‌-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టు ఏమైంది మోదీ? అంటూ ఫ్లెక్సీలు వెలశాయి. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏది?, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ఏమయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.