Weather Latest News: ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అడ్డంకి ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. జూన్ 4, 5వ తేదీనే రాయలసీమను రుతుపవనాలు తాకాల్సి ఉంది. నేడు లేదా రేపు నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోత ఉండనుంది.
మరో మూడు గంటల్లో ఈ జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు జూన్ 9న రాబోయే 3 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. అంతేకాక, 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వేగవంతమైన గాలులు వీయనున్నాయి. మరో 3 గంటల్లో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ ఐఎండీ జూన్ 9న ఉదయం 7 గంటలకు ట్వీట్ చేసింది.
ఇక తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో వాతావరణ వివరాలు ఇలా ఉండనున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్ కూడా జారీ అయింది. అంతేకాక, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణం ఇలా..
‘‘విజయవాడ నగరంలో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు కూడా ఎండవేడి కొనసాగుతుంది. కానీ జూన్ 10 నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తక్కువగా నమోదవ్వనున్నాయి. ఆ తర్వాత జూన్ 15 నుంచి 35 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. విశాఖ నగరంలో మాత్రం ప్రస్తుతం ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఉక్కపోత వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు తెల్లవారుజామున అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి విస్తరించే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.