బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. రెండో ఆవర్తనం నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం అవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. నేటి నుంచి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.






అక్టోబరు 6 ఉదయం 5 గంటలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడనుంది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం 7 గంటల  నుంచి వర్షాలు మొదలు కానున్నట్లుగా అంచనా వేశారు.


ఈ జిల్లాలకు వాతావరణ వాతావరణ అధికారులు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. మరోవైపు, హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ఏపీపై మూడు, నాలుగు రోజులపాటు ప్రభావం చూపనుంది. నేటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి (అక్టోబర్ 6) తరువాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో  వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడటంతో రేపటి నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడతాయి. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.