‘‘నిన్న వాయువ్య, పరిసరాలలోని మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ రోజు పశ్చిమ బెంగాల్ - ఒడిశా తీరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రదేశం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్ళే కొలది వాలి ఉంది. ఇది రాగల 48 గంటల్లో సుమారుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా - దక్షిణ జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగముతో వీయవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.
‘‘సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు పడ్డాయి. గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఇప్పటి దాకా తక్కువగానే పడ్డాయి. రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఉన్నా సాధారణం కంటే తక్కువ వర్షాలు కొనసాగనున్నాయి.
భూమి బాగా వేడెక్కినప్పుడు పీడనం ఏర్పడి, ఉపరితల ఆవర్తనం వైపుగా వెళ్తున్న గాలుల్లో బలమైన మేఘాలు ఏర్పడతాయి. నేడు సాయంకాలం విశాఖ నగరంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రికి రాయలసీమ జిల్లాలు - చిత్తూరు, అన్నమయ్యతో పాటుగా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు - తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు పడనుంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కొద్ది భాగాలకే వర్షాలు పరిమితం కానున్నాయి’’ ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.