Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది. వచ్చే ఐదు రోజులు ఈ రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండడంతో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో భారీ ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులుపడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. 


ఎమర్జెన్సీ నెంబర్లు 
హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో  వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అటు ఏపీలోనూ కొ న్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వానలు పడుతున్నాయి.  వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో పగటివేళ 27 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ నమోదువుతన్నాయి. ఏపీలో 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి.


తెలంగాణలో వర్షం పడే ప్రాంతాలు ఇవే
తెలంగాణాలో సోమవారం, మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్​, నిజామాబాద్​, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట్​, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్గాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్​ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.