Kadiam Srihari Vs Aruri Ramesh: వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఒకరిపై మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరు అవినీతిపరుడు అంటే. మరొకరు నమ్మక ద్రోహి అని ఎదురు దాడులు చేసుకుంటున్నారు. మరి వీరు ఎవరో కాదు ఇద్దరు నేతలు రాజకీయాల్లో గురు శిష్యులుగా కొనసాగినవారే. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి దూషించుకుంటున్నారు.


వ్యక్తిగత జీవితాలపై మాటల దాడులు చేసుకుంటున్న నేతలు గురువు, శిష్యులు. శిష్యుడు ఆరూరి రమేష్ బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉంటే. గురువు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో వరంగల్ పార్లమెంట్‌లో గురుశిష్యుల సవాల్‌గా మారింది. వీరిద్దరూ బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి ఒకరు కాంగ్రెస్ మరొకరు బీజేపీలో చేరారు. ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉంటే... కడియం శ్రీహరి కూతురు కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 


ఆరూరి రమేష్ బీఅర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కడియం శ్రీహరి కారణమనే కోపంతో రగిలిపోతున్నారు. ఇదే తరుణంలో కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో గురు శిష్యులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. అధికాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.
ఆరూరి రమేష్ విధానాలపై కాకుకుండా వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనమని కడియం శ్రీహరి అన్నారు. కడియం కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఉద్యోగం చేస్తుందని అన్నారు. ఆరూరి రమేష్ ఒక దళితుడై ఉండి ఈ విధంగా మాట్లాడటం  సిగ్గుచేటన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఆరూరి రమేష్‌లా భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ చేసి కోట్ల ఆస్తులు సంపాదించలేదని కడియం అన్నారు. తన నిజాయితే తనకు పెట్టుబడీ అన్నారు. తాను టిడిపిలో మంత్రిగా ఉన్నప్పుడు ఆరూరి రమేష్ సామాన్య కార్యకర్త అని చెప్పారు. ఆరూరి రమేష్‌ను క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేసింది తానేనని గుర్తుచేశారు. కాంట్రాక్టులు ఇప్పించినందుకు డబ్బులు ఇచ్చావా అని అడిగారు. వెన్నుపోటు పొడిచి పార్టీ మారింది నువ్వు అని కడియం శ్రీహరి ఆరోపించారు. 


నేను గుంటూరులో పుట్టలేదు.!
బిజెపి ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌పై కడియం కావ్య కూడా విరుచుకుపడ్డారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకొని ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడటం సిగ్గు చేటని కడియం కావ్య అన్నారు. కుల, మత రాజకీయాలు చేసి ఆరూరి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారని కావ్య మండిపడ్డారు. కావ్య వరంగల్లోనే పుట్టి పెరిగిందని సమ్మక్క సారాలమ్మ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీ మారింది ఆరూరి రమేష్ కాదా అని ఆమె విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కావ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికలల్లో బుద్ది చెప్పిన ప్రజల వద్దకు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వెళ్తవని ప్రశ్నించారు. వరంగల్ ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని కావ్య అన్నారు. 


ఆరూరి రమేష్ సైతం కడియం శ్రీహరి, కావ్యపై ధ్వజమెత్తారు. కడియం కావ్య కాదని, కావ్య నజీర్ ఫ్రమ్ గుంటూరు అని ఆరూరి ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నిక వరంగల్, గుంటూరు వ్యక్తులకు జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. కడియం శ్రీహరి వెన్నుపోటు రాజకీయాలు చేస్తారన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందే ఆరూరి రమేష్ కాంట్రాక్టర్ అని గుర్తు చేశారు.


ఇలా ఆరూరి రమేష్, కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విమర్శలు వ్యక్తిగత దాడులు ఇంతటితోనే అగుతాయా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.