Warangal Crime News: చదివింది ఎమ్మెస్సీ, కానీ బెట్టింగ్‌కు బానిసై చోరీలు- పాత నేరస్థుడిని మరోసారి అరెస్టు చేసిన పోలీసులు
Warangal Crime News: పీడీ యాక్టుపై జైలుకు వెళ్లొచ్చి మళ్లీ దొంగతనాలు చేస్తున్న పాత నేరస్థుడిని వరంగల్ లో పోలీసులు అరెస్టు చేశారు.
Warangal Crime News: అతడు ఉన్నత చదువులు చదివాడు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. కానీ వ్యసనాలకు, బెట్టింగ్ లకు బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలోనే పలు దొంగతనాల కేసుల్లో నిందితుడైన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పీడీ యాక్టు కింద కొంత కాలం పాటు జైలు జీవితం కూడా గడిపాడు. అయినా అలవాట్లు మార్చుకోలేదు. జైలు నుండి బయటకు రాగానే మళ్లీ వ్యసనాలు, బెట్టింగ్ లు కొనసాగించాడు. వాటికి డబ్బు కోసం దొంగతనాలు చేస్తూ తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు. ఆ ఎమ్మెస్సీ చదివిన దొంగ నుండి 11.50 లక్షల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వ్యసనాలు, బెట్టింగ్‌లకు డబ్బు కోసం చోరీలు
ఎర్రబోతుల సునీల్(24) తండ్రి పేరు బాబు, సగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం, పెద్దఎల్లాపూర్. ప్రస్తుతం హనుమకొండలోని జులై వాడలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు ఎర్రబోతుల సునీల్ కాకతీయ వర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. ఆన్‌లైన్ లో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలపై బెట్టింగ్ పెడుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో పెద్ద మొత్తం డబ్బులు పోగోట్టుకోవడంతో తిరిగి డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఇందుకోసం సునీల్ మరో నిందితుడితో కలిసి చోరీలు చేయడం ప్రారంభించాడు. 2020 సంవత్సరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ, హనుమకొండ, మట్వాడ, ధర్మసాగర్, ఆలేర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పదిహేనుకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. 2022 సంవత్సరంలో నిందితుడిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సునీల్ పై సుబేదారి పోలీసులు పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. కొంత కాలం పాటు జైలు జీవితం గడిపాడు. గత సంవత్సరం అక్టోబర్ లో జైలు నుండి విడుదలయ్యాడు.
Also Read: Warangal News: ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త! పోలీసులు చెప్పిన సూచనలివీ
జైలు జీవితం గడిపినా మారని బుద్ధి
జైలు జీవితం గడిపినా సునీల్ బుద్ధి మారలేదు. కారాగారం నుండి బయటకు రాగానే మళ్లీ బెట్టింగ్ లు, వ్యసనాలు కొనసాగించాడు. డబ్బుల కోసం మళ్లీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులు డ్రైవర్ గా పనిచేస్తూనే కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్ల కోసం రెక్కీ నిర్వహించాడు. ఈ విధంగా నిందితుడు రెండు చోరీలకు పాల్పడ్డాడు. గత నెల ఏప్రిల్ లో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి పరిమళకాలనీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ నెల 12వ తేదీన కోమటిపల్లి పోలీస్ కాలనీలో తాళాలు పగులగోట్టి చోరీకి పాల్పడి విలువైన బంగారు అభరణాలను చోరీ చేశాడు. ఈ చోరీలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ కేయూసీ జంక్షన్ లో వాహనాల తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు సునీల్ దొరికాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన సునీల్ ను తనీఖీ చేయగా అతని వద్ద చోరీ సొత్తుతో పాటు తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు దొరికాయి. దీంతో సునీల్ ను పట్టుకుని విచారించగా చోరీల చిట్టా బయటపెట్టాడు.
Also Read: Visakha News: అనుమానంతో ప్రేయసిన చంపేసి పోలీసులకు లొంగిపోయాడు - విశాఖలో యువకుడి దుశ్చర్య
నిందితుడు సునీల్ నుండి 11 లక్షల 50 వేల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు, ఒక సెల్‌ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ ను సకాలంలో పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు సీపీ ఏవీ.రంగనాథ్ అభినందించారు.