Warangal Congress Woman Workers Protests: వరంగల్ కు చెందిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గాంధీ భవన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వొద్దని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మహిళ కార్యకర్తలకు మానాభిమానాలపై రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ఆయన కామాందుడని.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవద్దని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మహిళా నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లోని గాంధీ భవన్ ను ముట్టడించారు. 


అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటికొండ రాజయ్య లాంటి కామాందుణ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే మహిళా కార్యకర్తలకు నాయకులకు రక్షణ ఉండదని అన్నారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు, అక్రమ కేసులకు పాల్పడిన ఘటనలు గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు అన్నో వ్యయప్రయాసలు పడుతున్నారని ఇప్పుడు తాటికొండ రాజయ్య పార్టీలోకి వస్తే ఆయన అనుచరుల పెత్తనం నడుస్తుందని అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.