Errabelli Dayakar Rao About CM KCR: 
వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశానన్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండ లోని వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో, వరంగల్ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లికి దేవాలయాల అర్చకులు, అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. మంత్రికి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
ఆలయాల సందర్శన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్ధశ కలిగిందన్నారు. గత పాలకులు యాదాద్రి, వేములవాడ, కొండగట్టు లాంటి రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను పట్టించుకోలేదని ఆరోపించారు. స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.


నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం కేసీఆర్ తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతున్నది. అందుకే సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ అధినేత ప్రధాని కావాలని నేడు ప్రత్యేక పూజలు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.


కాకతీయుల్ని గుర్తుకు తెచ్చే శివరాత్రి..
‘శివరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది కాకతీయ రాజులు. వాళ్లు గుర్తుకురాగానే మనకు వెయ్యి స్తంబాల గుడి, రామప్ప ఆలయాన్ని గుర్తు చేసుకుంటాం. దేశంలోనే ప్రతిష్ట కలిగిన ఆలయాలు ఇవి. కాకతీయ రాజులు పరిపాలన చేసిన సమయంలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. రామప్ప ఆలయం, కొండగట్టు ఆలయం డెవలప్ మెంట్ పనులు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నిసార్లు కోరినా ఆ ఆలయాలకు మోక్షం కలగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఆలయాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తున్నారని’ మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. 


స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా పాత ఆలయాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అన్ని మతాలు, వర్గాల వారిని సమానంగా చూస్తూ అందరి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నేత కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారని, ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఈ శివరాత్రి సందర్భంగా ఆకాంక్షించారు మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్ర ప్రగతి దేశ స్థాయిలో నెంబర్ వన్ గా నిలవాలని, ఎన్నో రంగాల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా మారిందన్నారు.


కొండగట్టును సందర్శించిన సీఎం కేసీఆర్
కొండగటట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు. కొండగట్టు అంజన్న ఆలయానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి పైపుల ద్వారా నీటిని తరలించే పనులను చేపట్టాలని, కార్యదర్శి  స్మితా సబర్వాల్, ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సి ఉన్నందున తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.