Telangana Minister Fighting: మేడారం పనుల విషయంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి! రేవంత్ టీంలో మరో వివాదం!
Ponguleti vs Konda Surekha: రేవంత్ రెడ్డి టీంలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం మొదలైంది. ఈ మధ్య ఇద్దరి మధ్య పంచాయితీ తేల్చిన రెండు రోజులకే మరో ఇద్దరి మధ్య డిష్యూం డిష్యూం తెరపైకి వచ్చింది.

Ponguleti vs Konda Surekha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం బాగా లేనట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టాయి. వీటితోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న టైంలో మంత్రుల పంచాయితీ కొత్త తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే పలువురు మంత్రుల మధ్య ఉన్న విభేదాలతో సతమతమవుతున్న క్రమంలో కొందరు నేరుగా మీడియా ముందే రచ్చ రచ్చ చేస్తున్నారు. దాన్ని పరిష్కరించి హమ్మయ్య అనుకునే లోపు మరో ఇద్దరు పంచాయితీ పెట్టారు.
మేడారం పనుల పంచాయితీ
రేవంత్ టీంలో ఈసారి కొండా సురేఖ తన సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తన శాఖలో ఆయన జోక్యం ఎక్కువైందని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ మధ్య మేడారం వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఆ పనులే ఇద్దరి మంత్రుల మధ్య చిచ్చు పెట్టినట్టు చెబుతున్నారు. మేడారం పనుల్లో ఏడు కోట్ల విలువైన టెండర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలను ఇచ్చారను అంటున్నారు. తనకు తెలియకుండా తన మంత్రిత్వశాఖ పనుల్లో పొంగులేటి పెత్తనమేంటంటూ సురేఖ మండిపడ్డారని బోగట్టా.
ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన కొండా సురేఖ
పొంగులేటిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ పరిష్కారం లభించలేదని భావిస్తున్న కొండా సురేఖ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఢిల్లీ బయల్దేరి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం అధినాయకత్వం అపాయింట్‌మెంట్ తీసుకొని పొంగులేటిపై ఫిర్యాదు చేస్తారని ఆమె సన్నిహితులు అంటున్న మాట.
పెరుగుతున్న మంత్రుల పంచాయితీలు
ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య పంచాయితీలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల ఎత్తును గ్రహించి వాటికి అనుగుణంగా పైఎత్తులు వేయాల్సిన టైంలో ఇలా సొంత నేతల పంచాయితీలు ఏంటని ప్రభుత్వం, పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో అసలు ముఖ్యమంత్రితోనే ఏ మంత్రికి పడటం లేదని ప్రచారం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రితోపాటు మంత్రులంతా ఖండించారు. తర్వాత నల్గొండ మంత్రుల మధ్య పంచాయితీ నడిచింది. బహిరంగంగానే వారిద్దరు మోహాలు చిట్లించుకున్న సంగతి ప్రజలంతా చూశారు.
అది కాస్త ముగిసిపోయిందని అనుకున్న టైంలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య గొడవ రచ్చకెక్కింది. బహిరంగ వేదికపైనే ఇద్దరూ తిట్టుకున్నారు. మొత్తానికి పీసీసీ జోక్యం చేసుకొని పొన్నంతో సారీ చెప్పించి అడ్లూరిని కూల్ చేశారు. ఇలా ఆ వివాదాన్ని పరిష్కరించి ఇటు తిరిగే సరికి ఇక్కడ పొంగులేటి, కొండా సురేఖ మధ్య వార్ షురూ అయ్యింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో అన్న చర్చ పార్టీలో నడుస్తోంది.
నిత్యం ప్రోటోకాల్ వివాదాలు, ప్రయార్టీ ఇవ్వడం లేదన్న మోహాలు మాడ్చుకున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. వీటి సంగతి పీసీసీ చూసుకుంటోంది. కానీ అన్నింటినీ పరిష్కరించాల్సిన మంత్రులే ఇలా తగవులాడుకోవడం పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలాంటిది ఎవరికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.





















