తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో  త్వరలోనే ముంపు ప్రాంతాలను పర్యటిస్తానని మంగళవారం గవర్నర్ తమిళి సై ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.


ముందుగా ఆమె హైదరాబాద్‌ నుంచి వరంగల్ కు చేరుకున్నారు. వరంగల్‌ వెళ్లిన తరువాత ఆమె ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి గవర్నర్ వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.


అక్కడ నుంచి బయల్దేరిన ఆమె హనుమకొండ జవహర్‌ నగర్‌ లో వరద ప్రాంతాన్ని పరిశీలించారు. వరద బాధితులను ఆమె పరామర్శిచారు. బాధితులకు రెడ్ క్రాస్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ కిట్స్‌, నిత్యావసరాలు పంపిణీ చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ...'' భారీ వరదలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. 


వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. 


ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు ముంపు ప్రాంతాల్లో పరిశీలించి, ప్రజల పరిస్థితిని చూసి సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వరంగల్ పట్టణంలో స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా జవహర్ నగర్ కాలనీ బ్రిడ్జిని పున: నిర్మించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు గవర్నర్. 


వరంగల్‌ నగరాన్ని మొత్తాన్ని వరదలు ముంచెత్తిన్నప్పటికీ అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న టైంలో  గవర్నర్ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.