Telangana CM Revanth Reddy at Station Ghanpur in Jangaon | స్టేషన్ ఘన్‌పూర్: బీఆర్ఎస్ నేత హరీష్ రావు పిల్లకాకి అని, అసలు మనిషి కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులపై చర్చ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ చేసిన పాపల చిట్టా అసెంబ్లీలో చెప్పా… ఇప్పటి వరకు జరిగింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా కేసీఆర్ మొత్తం చిట్టా విప్పుతా ‘కృష్ణా నది నీటిపై లక్షా 81వేల కోట్లు కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాడారు. లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయింది. రిపేర్లు చేయాలంటే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారని పెద్ద మాటలు చెబుతున్న హరీష్ రావు తాటిచెట్టంతా పెరిగాడు కానీ ఆయన మెదడులో ఆవకాయ అంత తెలివితేటలు లేవు. శ్రీరాం సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఎవడు కట్టాడో చెప్పాలి’ అన్నారు.


ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే..


జనగామ జిల్లా స్టేషన్ ఘన‌పూర్‌లో రూ.800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ప్రజా పాలన సభలో పాల్గొని ప్రసంగించారు. ‘జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దేవాదుల, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను కట్టించి, మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా. తెలంగాణ ప్రభుత్వం కోటి 56 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వరి పండించాం. హరీష్ రావు (పిల్లకాకులు)లతో నాకేంటి. అసలైన ఆయన కేసీఆర్ నే చర్చకు రావాలని, ఆయననే రమ్మని ఛాలెంజ్ విసిరారు. శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, బీమా, నెట్టెంపాడు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద మాట్లాడుతారా.. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మేం ఏం చేశామో తెలుస్తుంది.



2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బ రుచిచూశారు.  కేసీఆర్ ప్రభుత్వం నుంచి 58 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. అధికారం పోతే ప్రజల్లో ఉండడా, ప్రజల మధ్య తిరగడా. ఆయన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు వాడరు. జీతం ఇచ్చే యజమానిగా అడుగుతున్న.. జీతం తీసుకుని కేసీఆర్ పనికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. జీతం తీసుకుంటున్న కేసీఆర్ ఫాం హౌస్ లో నిద్రపోతే బీఆర్ఎస్ అధినేత అధికారం కోల్పోతే ప్రజల నుంచి దూరంగా ఉంటారా? మీరు లక్షల కోట్లు సంపాదించుకుని ఫాం హౌస్‌లు కట్టుకున్నారు. 


కేసీఆర్ ఫ్యామిలీకి లక్ష కోట్లు ఎలా వచ్చాయి ?


అధికారం వచ్చిన తరువాత కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్లు ఎలా సంపాదించారు, మీ ఆస్తులు పదేళ్లలో ఎలా పెరిగాయో ప్రజలకు చెప్పాలి. మీ సంపాదన టెక్నిక్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు ప్రజల మధ్యకు రాలేకపోతే వెయ్యి మంది చొప్పున ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు పంపిస్తాం. వారికి మీ సంపాదన టెక్నిక్ నేర్పించండి. కేసీఆర్ ప్రతినెలా 3.92 లక్షల జీతభత్యాలు తీసుకుంటున్నారు. తుఫానులో సర్వం కోల్పోయిన వారి కంటే కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కువ బాధ పడుతోంది.