Telangana News: త్వరలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పార్టీ మారిన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన అనర్హతవేటు ఖాయమని, త్వరలోనే స్టేషన్ ఘనపూర్ కు ఉప ఎన్నికలు రానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తో నేడు కేటీఆర్ హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన తాటికొండ రాజయ్య పలు సలహాలు, సూచనలు కేటీఆర్ తో పంచుకున్నారు. పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్ పూర్ లో ఓడించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కడియం శ్రీహరికి బుద్ధి చెబుతాయన్నారు.
ప్రజా క్షేత్రంలో బుద్ది చెబుతాం
ఇప్పటికే తాటికొండ రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో మరోసారి స్టేషన్ ఘన్ పూర్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులతో త్వరలోనే ఒక విస్తతస్ధాయి సమావేశాన్ని స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న మండల పార్టీ నాయకులతో మాట్లాడి తేదీలను నిర్ణయించాలని రాజయ్య గారికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనేక అవకాశాలు ఇచ్చిన మూడు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత కూడా కేవలం రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు
హైకోర్టు కీలక తీర్చు
కాగా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై నెల రోజుల్లోగా చర్యలు చేపట్టేందుకు విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సుమోటోగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానా నాగేందర్‌లపై బీఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.
ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న
కేటీఆర్ మాట్లాడుతూ.. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న మాదిరి కాంగ్రెస్ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల్లో వేల హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోయారని, రుణమాఫీ విషయంలోనూ మోసం చేశారని కుండ బద్దలు కొట్టారు. ఢిల్లీలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలు తెలంగాణ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వానాకాలంలో పెట్టుబడి సాయం ఉపసంహరించుకున్న కేటీఆర్ ఇప్పుడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేక చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లోని ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు.