Kazipet Rail Coach Factory కాజీపేట: 2026 నుంచే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మానుఫ్యాక్చరింగ్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ (బ), కిషన్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర టూరిజం, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చిన కాజీపేటకు చేరుకున్న మంత్రులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ పనులు జరుగుతున్న తీరుపై మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన గ్యారంటీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు.
కొత్త టెక్నాలజీతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Rail Manufacturing Unit)కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దాదాపు 40 సంవత్సరాల ప్రజల కల. ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. 500 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ పరిశ్రమ ఏర్పాటు జరుగుతోందని, 2026 నాటికి ఈ యూనిట్‌లో మానుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుంది. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకొని, ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజిన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయి. పలు రకాల రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించనున్నాం. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలుకేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల డిమాండ్, ఆకాంక్ష. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయి.
మూడు వేల మందికి ఉపాధినరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, మంజూరు చేశారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమే. వరంగల్‌లో రింగ్ రోడ్‌లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిందనీ, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది కేంద్రప్రభుత్వం. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించాం.
ముఖ్యంగా వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం ఎంతో ఉందని నేను గత బీఆర్ఎస్ పాలన సమయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు.. బిజెపి ఏం తెచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు కళ్లు, చెవులుంటే మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూసి తెలుసుకోవాలని’ కిషన్ రెడ్డి అన్నారు.