BRS Silver Jubilee Meeting | వరంగల్: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయగా.. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభకు హనుమకొండ వేదిక అయింది. ఆదివారం సాయంత్రం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకకు అన్ని జిల్లాల నుంచి ప్రజలను నేతలు సమీకరించారు.
కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలు వెయిటింగ్..
అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సభపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ చూడాలని ఏపీ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు అవుతూ.. వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. ఇప్పుడు ఎల్కతుర్తి సభలో పాల్గొని తన పదునైన మాటలు, విమర్శనాస్త్రాలతో అధికార కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. సభ ఏదైనా సరే తనదైనశైలిలో, అందర్నీ ఆకట్టుకునేలా ప్రసంగించడంలో దిట్ట. ఆయనను రాజకీయాల్లో మాటల మాంత్రికుడుగానూ వ్యవహరిస్తారని తెలిసిందే.
ఎన్నికల హామీల అమలులో వైఫల్యమే తన ప్రధాన అస్త్రమని తెలంగాణ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదుర్కొనేందుకు కేటీఆర్, లేక హరీష్ రావు చాలు అని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో పదేపదే ప్రస్తావించారు. అయితే కేసీఆర్ తిరిగి పంజా విసిరేందుకు సరైన సమయం బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ఆవిర్భావ వేడుక అని భావించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు సైతం గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకాలేదు. కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరయ్యారు. తరువాత కేటీఆర్, హరీష్ రావులే అధికార పక్షంపై విమర్శల దాడి చేశారు.
బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక, అటు సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగించనుండటం ఇదే తొలిసారి. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఎల్కతుర్తిలోని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం దాదాపు 6 గంటలకు కేసీఆర్ సభలో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని మాజీ మంత్రులు, పార్టీ నేతలు తెలిపారు.
భారీ బందోబస్తుప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభ కావడంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో 2 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సభా జరిగే చోట ఏకంగా 250 వరకు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హనుమకొండ - సిద్దిపేట, కరీంనగర్ రూట్లలో వాహనాలను మళ్లిస్తున్నారు.
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఎల్కతుర్తి సభకు వచ్చేవారి కోసం 10 లక్షల మంచినీళ్ల బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. సుమారు 50 వేల వరకు వాహనాలు సభకు రానున్నాయని.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వేదిక మీద ప్రసంగం చూసేందుకు 23 చోట్ల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చారు.