నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో దద్దరిల్లింది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి, అక్కడ నివాళులర్పించాలని తోటి కార్మికులు పట్టుబట్టారు. తమ సహచర ఉద్యోగి త్యాగానికి గుర్తుగా డిపో సాక్షిగా నివాళి అర్పించడమే తమ లక్ష్యమంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ నిరసనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులకు మద్దతుగా నిలిచారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు ఆయన ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎలాగైనా డిపో వద్దకు తీసుకెళ్లేందకు అనుమతించాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసుల కాళ్లావేళ్లా పడ్డ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు నిరసనలో పాల్గొన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.
పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ముత్తోజిపేటలో గందరగోళం నెలకొంది. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికులు నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, కార్మికుల పట్టుదలతో ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు. భూపాలపల్లిలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ముత్తోజిపేటలో పోలీసుల పహారా.. ప్రభుత్వంతో జేఏసీ చర్చలుతెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) భౌతికకాయం ఆయన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం, నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు, శంకర్ గౌడ్ మృతితో నెలకొన్న విషాద పరిస్థితుల మధ్యే ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ వెంకన్న ప్రకటించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కొందరు జేఏసీ నేతలు ముత్తోజిపేటకు వెళ్లారు. హైదరాబాద్‌లో సచివాలయం వేదికగా శుక్రవారం ఉదయం సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ కమిటీ సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తుంది. ఈ చర్చల ఫలితం సమ్మె భవిష్యత్తును నిర్ణయించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
