వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఎప్పుడూ లోపాలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు ఓ పెషెంట్ ని కొరికిన ఘటన సంచలనం అయింది. ఆ తర్వాత ఏదో ఒక సమస్యతో ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఒకే నెలలో రెండుసార్లు పాము కనిపించడం ఆస్పత్రి నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది.
ఆదివారం (అక్టోబరు 23) సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పాము కనిపించింది. ఆస్పత్రిలోని న్యూరో వార్డులో తాచుపాము కనపడడంతో జనం భయపడిపోయారు. పేషెంట్ బెడ్ కింద పామును రోగి బంధువులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది పాములు పట్టె వారిని పిలిపించి ఆ తాచుపామును దొరకబట్టారు. ఆ తర్వాత ఆ పామును పట్టి అడవిలో వదిలేశారు.
అక్టోబరు 13న కూడా..
అక్టోబర్ 13వ తేదీన కూడా ఓ పాము ఇదే ఆస్పత్రిలో కనిపించింది. ఫీవర్ వార్డులోని టాయిలెట్స్ లో తాచు పాము ఉన్నట్లుగా ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఈ పామును చూసి భయపడిపోయిన రోగులు, వారి బంధువులు బయటికి పరుగులు తీశారు. ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే స్పందించిన సిబ్బంది స్నేక్ క్యాచర్స్ ను పిలిపించి ఆ పామును ప్రాణాలతో పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత సీరియస్ గా స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ఆస్పత్రిలో, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. వైద్యులు, సిబ్బంది అంతా కలిసి ఎంజీఎం పరిసరాలను శుభ్రం చేశారు. ఎలుకలు, పాములకు పాములకు ఆవాసంగా ఉన్న పుట్టలు, తుప్పలను తొలగించారు.
గతంలో పేషెంట్ ను కొరికిన ఎలుకలు
గత ఏప్రిల్‌లో ఓ పేషెంట్‌ను ఎలుకలు కొరికాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఏప్రిల్ 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ప్రభుత్వం స్పందించి కారకులపై వేటు వేసింది. బాధితుణ్ని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేదు. ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు.
ఎలుకలు, పాముల కలకలంపై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చర్చ మొదలైంది. అతి పురాతన భవనాలు, చుట్టూ చెత్త, పక్కనే మురికి కాలువ, మార్చురీ, పేషేంట్స్ అటెండెంట్స్ వదిలేసే ఆహారపు వ్యర్థాలే విష పురుగులు రావడానికి కారణమని చెబుతున్నారు.