100 Years Of NTR: వరంగల్: విశ్యవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హనుమకొండ లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు, పేదల పెన్నిధి NTR అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన ఆయన నిరంతరం ఎన్టీఆర్ పై ప్రత్యేక అభిమానం చాటుకునేవారు. నేడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించిన ఆయన నటనను గుర్తుచేసుకుంటూ, సీఎంగా ప్రజలకు చేసిన సేవల్ని ప్రస్తావించారు.
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దివంగత ఎన్టీఆర్ గారికి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వారి ఆశయాలను సీఎం కేసీఆర్ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు ఎన్టీఆర్. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత, ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఎన్టీఆర్ లు తప్ప మిగతావారంతా బ్రోకర్లే అని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ ప్రముఖులతో రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు మహానటుడు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, శఖపురుషుడు, తెలుగు వారి గుండెచప్పుడు అంటూ నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఏపీలోని రాజమహేంద్రవరంలోని వేమగిరి లో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకులను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ వచ్చే ఏడాది ఎన్నికలు కావడంతో మహానాడు రెండో రోజులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
తెలుగు వారు ఉద్వేగానికి లోనయ్యే పేరు ఎన్టీఆర్. తెలుగునేల పులకించి పోయే నేత కూడా ఆయనే. తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు. తెలుగు నేల ఉన్నంత వరకూ ఆయన చిరస్మరణీయుడు. తెలుగువారి సామాజిక రాజకీయ జీవనంలో ఎన్టీఆర్‌ది ఓ కీలక ఘట్టం. వందేళ్ల క్రితం ఆయన జన్మించారు. వెండితెరను ఏలారు. తర్వాత రాష్ట్రాన్ని పాలిచించారు. ఆ దిగ్గజం శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.