Warangal Student got National Childerns Award: జాతీయ స్థాయిలో వరంగల్ (Warangal) విద్యార్థిని సత్తా చాటారు. జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు (Laxmipriya) జాతీయ బాలల పురస్కారం దక్కింది. ఈ నెల 22న (సోమవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఈ నెల 23న ప్రధాని మోదీని (PM Modi) కలిశారు. ఈ సందర్భంగా ఆయన బాలికను ప్రశంసించారు. ఈ నెల 26న శుక్రవారం జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లోనూ ఆమె పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మిప్రియను తల్లిదండ్రులు, గురువులు అభినందించారు. ఆమెకు పురస్కారం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.
వారి ప్రోత్సాహంతోనే
తనకు జాతీయ బాలల పురస్కారం దక్కడంపై విద్యార్థిని లక్ష్మిప్రియ ఆనందం వ్యక్తం చేశారు. 'కాజీపేట మొంట్ ఫోర్డ్ స్కూలులో 10వ తరగతి చదువుతున్నాను. గత ఏడేళ్లుగా నా గురువు సుధీర్ రావు వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నాను. గురువు, తల్లిదండ్రులతో పాటు స్కూల్ ప్రోత్సాహం వల్లే పురస్కారం అందుకోగలిగాను. కూచిపూడిలో వాచికాభినయం ఉంటుంది. ఇది ఏ ఇతర శాస్త్రీయ నృత్యాల్లోనూ లేదు. అందుకే ఈ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జాతీయ కళా ఉత్సవ్ లో అన్నీ డాన్స్ ఫార్మాట్స్ లోనూ మొదటి బహుమతి పొందాను. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడడం ఆనందం కలిగించింది. కళాకారులకు ఓ వేదిక ఉన్నప్పుడే తమ ప్రతిభను ప్రదర్శించగలరు. ప్రభుత్వం నుంచి ఇదే కోరుకుంటున్నా. ప్రోత్సహిస్తే నా ప్రతిభను ప్రదర్శించగలను.' అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వీరికి అవార్డులు
మరోవైపు, రిపబ్లిక్ డే' సందర్భంగా కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs).. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantary Awards) అందజేయనుంది. ఈ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 29 మందికి పతకాలు దక్కాయి. తెలంగాణ (Telangana) నుంచి 20 మంది.. ఏపీ నుంచి 9 మందికి పతకాలు ప్రకటించారు. ఏపీలో 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీస్ విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. తెలంగాణ అదనపు డీజీలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్ లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి.
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్ గఢ్ నుంచి 26 మంది, ఝార్ఖండ్ నుంచి 26, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF) నుంచి 65 మంది, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మందికి ఈ పురస్కారాలు వరించాయి. అలాగే, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వరిస్తోన్న 119 మంది, జమ్మూ కశ్మీర్ లో పని చేస్తోన్న 133 మంది మెడల్స్ దక్కాయి.
Also Read: HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, 100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు