Sarpanch Navya Case :  ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మధ్య ఏర్పడిన వివాదంలో పోలీసులు నిజానిజాలేమిటో తేల్చారు.  నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు  జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా పోలీసులకు   సర్పంచ్ నవ్య ఆధారాలూ సమర్పించలేదన్నారు.  నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు నవ్య తెలిపారని కూడా వివరించారు. దీంతో ఆ కేసును పోలీసులు క్లోజ్ చేస్తున్నట్లయింది. 


రాజయ్యతో పాటు భర్తపైనా ఫిర్యాదు చేసిన సర్పంచ్ నవ్య             


రెండు వారాల కిందట  ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్‌పై కూడా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు  చేశారు.    రాజయ్య పాల్పడ్డ వేధింపులకు సంబంధించి ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ అనుచరులతో ఎమ్మెల్యే తనపై తీవ్ర ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న రూ.20 లక్షలు, ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.  ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గారని, సంతకం పెట్టాలంటూ తనపై ఆయనా ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లుగా చెబుతూ పత్రంపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం సబబేనా? అని నవ్య ప్రశ్నిస్తున్నారు. 


ఆధారాలు పోలీసులకు సమర్పించడంలో విఫలం                           


తాను డబ్బుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. తనపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఆయన పీఏ, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ మహిళతో పాటు వారి ప్రలోభాలకు లోనై తన మీద ఒత్తిడి తెస్తున్న భర్తను కూడా వదిలి పెట్టనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే చట్ట పరంగా పోరాడుతానని నవ్య ప్రకటించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆధారాలు సమర్పించాలని కోరారు.  రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా పోలీసులకు ఎలాంటి ఆధారాలూ నవ్య సమర్పించలేదు. నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని పోలీసులకు నవ్య తెలిపారు. దీంతో నవ్య - రాజయ్య పంచాయతీకి తెర పడినట్లయింది. 


నవ్య - రాజయ్య వివాదానికి తెరపడినట్లే !                                    


ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య మొదట  సంచలన ఆరోపణలు చేశారు. తర్వాత  హైకమాండ్ జోక్యంతో అంతా  సర్దుబాటు చేసుకున్నారు. కానీ తర్వాత కథ అడ్డం తిరిగింది. ఆధారాలు సమర్పించకపోవడంతో  ఎపిసోడ్‌కు తెరపడినట్లేనని భావిస్తున్నారు.