Warangal BRS candidate Tatikonda Rajaiah : వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ఏ క్షణమైనా రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు.ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. అసంతృప్తికి గురైనప్పటికీ కేసీఆర్ బుజ్జగించడంతో చల్లబడి.. కడియం విజయానికి ప్రయత్నించారు. ఎన్నికల్లో కడియం గెలిచినా బీఆర్ఎస్ ఓడిపోయారు.
తాటికొండ రాజయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ లో లేరు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. కాంగ్రెస్ పెద్దల్ని .. రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర అధిష్టానానికి వినతి పాత్రలు ఇవ్వడంతోపాటు ఆందోళన చేశారు. కాంగ్రెస్ లోకి రాజయ్య ను తీసుకోవద్దని బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాకుండా రాజయ్య తన ప్రయత్నాలు చేస్తుండడంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మహిళ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ భవన్ ముందు నిరసన తెలిపి పార్టీ పెద్దలకు సైతం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ లో చేరే కార్యక్రమానికి బ్రేక్ పడింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేయ ఎటూ కాకుండా పోయారు. అందుకే కేసీఆర్ పిలిస్తే చాలు ఆయన చేరిపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం వరకూ ఆయనకు పిలుపు వెళ్ల లేదు. చిన్న కారణాలతో పార్టీ మారిన ఆయన్ను అంతగా విశ్వసించలేమని బీఆర్ఎస్ బాస్ భావిస్తూ వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అభ్యర్థి ఎంపికపై వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు పార్టీలోని ముఖ్య నేతలతో ఆయన గత కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఉద్యమ నేత పరంజ్యోతి, హన్మకొండ జడ్పీ చైర్‌పర్సన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి.
కడియం కావ్యకు సరైన పోటీ రాజయ్యే అవుతారని.. ఆయననే దింపాలని కొంత మంది నేతలు కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఇద్దరూ..అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్ఎస్ కీలక నేతలే. ఇప్పుడు రాజయ్య బీఆర్ఎస్ తరపున బరిలో ఉంటే ముగ్గురు నేతలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అవుతారు.