Venkaiah Naidu :  ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయంగా పెద్దగా ఎలాంటి పని లేకపోవడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు ఇష్టమైన వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారు. ఆయన ఫుడ్ ట్రావెలర్‌ మాదిరిగా వినూత్నమైన హోటల్స్ ను సందర్శిస్తూ..సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సింపుల్ గా ఎక్కువ జనాదరణ పొందిన హోటల్స్ ను ఆయన ఉదయమే బ్రేక్ ఫాస్ట్ కోసం సందర్శిస్తున్నారు. అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ హోటల్ గొప్పదనం గురించి చెబుతున్నారు. దీంతో ఆ హోటల్ మరింత ఫేమస్ అవుతోంది. 


 





 


గురువారం రోజు హైదరాబాద్ లో రాయలసీమ అల్పాహారానికి ప్రసిద్ధి చెందిన పంచెకట్టు దోశ హోటల్ ను  సందర్శించారు.  మిత్రులతో కలిసి అక్కడి వంటకాలను రుచి చూశానని.. మన సంప్రదాయ వంటకాలకు ప్రాముఖ్యత కల్పించిన నిర్వాహకుల చొరవను అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇడ్లీ, దోశ లాంటి మన భారతీయ సంప్రదాయ వంటకాలకు రాయలసీమ రుచిని అదనంగా జోడించి, అందరి మన్ననలు పొందుతున్న పంచెకట్టు దోశ స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలి. మనవైన మరెన్నో రుచులను ఇదే విధంగా ప్రపంచానికి పరిచయం చేయాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు. 


మే రెండో తేదీన విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించారు.  నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయని ప్రశంసించారు. 


 





అత్యంత బిజీగా ఉండే రాజకీయ నాయకుడిగా దశాబ్దాల బాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వెంకయ్యనాయుడుకు ఇప్పుడు అనూహ్యంగా రిటైర్మెంట్ లభించినట్లయింది. అయితే ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఎక్కడకు వెళ్లినా మార్నింగ్ వాకింగ్ కు వెళ్తారు. ఇప్పుడు సమయం చాలా ఉండటంతో..  ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హోటళ్లను సందర్శించి టిఫిన్ చేస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టి వాటికి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.