మాజీ రాజ్యసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...కుటుంబసభ్యులు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రి చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.   కొన్ని రోజుల నుంచి డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పాటు పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో...సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందించడంతో కోలుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని ఎంపీ అరవింద్ తెలిపారు. డీ.శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించామన్నారు.


1948, సెప్టెంబరు 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించిన డీ శ్రీనివాస్...నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డీఎస్ పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాగింది. పార్టీలో ఉన్నత పదవులను చేపట్టారు. 1989లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి...తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొందారు.  తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డీ శ్రీనివాస్ ను మంత్రి పదవి వరించింది. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు.


2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో...విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా...డీఎస్ మాత్రం ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన...బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 


2014లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసే వరకు కూడా ఆ పార్టీలో ఉన్నా, కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.కొంతకాలానికి బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
డీఎస్‌కు ఇద్దరు కుమారులు.. ఒకరు సంజయ్, మరోకరు అరవింద్. సంజయ్ కార్పొరేటర్ విజయం సాధించి...నిజామాబాద్ మేయర్ గా పని చేశారు. మరో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరి, ఎంపిగా విజయం సాధించారు.