వికారాబాద్‌లో డ్రోన్లతో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ.. తెలంగాణలో టెక్నాలజీ వినియోగాన్ని కొనియాడారు. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెకీలే నిజమైన హీరోలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని అన్నారు. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 


సామాన్యులకు కూడా ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి రావాలని మోదీ కలలు కంటుంటారని కేంద్ర మంత్రి అన్నారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందని అన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని, చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని ప్రశంసించారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని అన్నారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి గ్రీన్‌జోన్లు ఏర్పాటుచేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.


‘‘సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది. అంకుర సంస్థలను తేలిగ్గా చూడొద్దు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను తీసుకెళ్తుంది. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యం.’’ అని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇంటరాక్టివ్‌ ఏరోస్పేస్‌ మ్యాప్‌ తయారు చేయబోతున్నామని సింధియా చెప్పారు. అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఇంటరాక్టివ్‌ ఏరోస్పేస్‌ మ్యాప్‌నకు సంబంధించిన ప్రత్యేకతలను వివరించారు.