దసరా పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణఇకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. స్పెషల్ బస్సుల ద్వారా రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు దసరా సందర్బంగా 5,500 స్పెషల్ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గతేడాదితో కంటే అదనంగా 1,302 ప్రత్యేక బస్సులను నడిపింది. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు సీబీఎస్, దిల్‌షుక్‌నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్‌ల నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపింది. సోంతూళ్లకు వేళ్లే ప్రయాణికులపై భారం వేయకుండా సాధారణ చార్జీలను వసూలు చేసింది టీఎస్ఆర్టీసీ. అదనంగా 13వందల బస్సులు నడపటం, సాధారణ చార్జీలనే వసూలు చేయడంతో ప్రజలను ఆర్టీసీ బస్సుల్లోనే సోంతూళ్లకు వెళ్లి వచ్చారు. ఈ కారణంగా ఆర్టీసీకి గతేడాది కంటే 25 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
దసరా సందర్భంగా ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజులపాటు ప్రత్యేక బస్సులను నడిపించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఒకేసారి రావడంతో మెజార్టీ ప్రజలకు సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి రోజు ఆర్టీసీకి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అయితే పండుగ సందర్భంగా ప్రతిరోజూ అదనంగా రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి గత 11 రోజుల్లో రూ.25 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. దీనికి తోడు డైనమిక్ చార్జీలు కూడా కలిసి వచ్చాయి. ప్రయాణికులు తక్కువ ఉన్న సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ వసూలు చేయడమే డైనమిక్ చార్జీలు వసూలు చేశారు.