తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరిప్రదర్శన చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించినట్లుగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గత గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న గిరి ప్రదర్శనకు తొలిసారిగా నడిపిన సూపర్ లగ్జరీ బస్సులకు భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ప్రతి నెలలోని పౌర్ణమికి రద్దీని బట్టి హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సు  సర్వీసులను నడిపేలా ఏర్పాట్లు చేసింది. 


అరుణాచలేశ్వరుని గిరి ప్రదర్శన ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే భక్తులను అక్కడికి చేర్చనున్నారు. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా ఆన్ లైన్ లో ఈ అరుణాచల గిరి ప్రదర్శన బస్సు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అరుణాచలానికి చేరుకుంటాయి. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తాయి. అక్కడ దర్శనానంతరం తిరుగుపయనం అవుతాయి.’’ అని ఆర్టీసీ అధికారిక ట్విటర్ ద్వారా తెలిపారు.


ఆ బస్సులకు అనూహ్య స్పందన


“టీఎస్ఆర్టీసీ తొలిసారిగా గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదర్శనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొదట ఒక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయగా.. నిమిషాల్లో సీట్లన్నీ బుకింగ్ అయ్యాయి. దీంతో రద్దీని బట్టి సర్వీసులను పెంచడం జరిగింది. మొత్తంగా 32 సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసి.. దాదాపు 1100 మందిని క్షేమంగా, సురక్షితంగా అరుణాచల గిరి ప్రదర్శనకు తీసుకెళ్లడం జరిగింది. వారంతా కాణిపాకం విఘ్నేశ్వరునితో పాటు వెల్లూరులోని గొల్డెన్ టెంపుల్ నూ దర్శించుకోవడం జరిగింది. 


అరుణాచల గిరిప్రదర్శనకు మంచి స్పందన నేపథ్యంలో ప్రతి నెల పౌర్ణమికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అవసరమైతే ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉంది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా..  సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ను సందర్శించి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.