Mothers Day Gift : టీఎస్ఆర్టీసీ మదర్స్ డే నాడు అమ్మలకు సూపర్ గిఫ్ట్ ఇస్తుంది. మాతృమూర్తులందరికీ మే 8న ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చింది. ఇటీవల టీఎస్ఆర్టీసీ సంస్కరణల బాటపట్టింది. సజ్జనార్ ఎండీ అయినప్పటి నుంచి ఆర్టీసీ నిర్వహణలో మార్పులు చోటుచేసుకున్నాయి. యూపీఐ పేమెంట్స్ లో చెల్లింపులతో పాటు పలు సంస్కరణలకు సజ్జనార్ శ్రీకారం చుట్టారు. పండగల సమయంలో చిన్నారుల ఫ్రీ ఆఫర్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పాస్ లలో రాయితీ ఇచ్చింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లులకు ఉచిత ప్రయాణం గిఫ్ట్ ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 


మదర్స్ డే గిఫ్ట్ 


తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మాతృమూర్తులకు మదర్స్ డే గిఫ్ట్ ఇస్తుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఈనెల 8న ఆదివారం పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులు రాష్ట్రంలోని అన్నీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకే ఈ అవకాశం వర్తిస్తుందని వెల్లడించింది. మదర్స్‌ డే సందర్భంగా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ మ‌ద‌ర్శ్ డే శుభాకాంక్షలు చెబుతూ మాతృమూర్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌, ఎండీ వి.సి.స‌జ్జనార్‌ మాట్లాడుతూ అమ్మ అంటే త్యాగానికి ప్రతిరూపం అన్నారు. తను ఎన్నో త్యాగాలు చేసిన మన జీవితాలను నిర్మిస్తుందన్నారు. అలాంటి మాతృమూర్తులకు ఇలాంటి అవకాశం కల్పించడం ఆర్టీసీ సంస్థ గొప్పగా భావిస్తుందన్నారు. 






ప్రజలకు చేరువయ్యేందుకు  


ఆర్టీసీ సామాజిక స్పృహతో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక సమయాల్లో ఇలాంటి రాయితీలు క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించామన్నారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్ లలో 20 శాతం రాయితీ ప్రకటించామని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని కోరుతుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ తరహా రాయితీలు, ఉచిత ప్రయాణాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతోంది.