TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తాకు సిట్ విచారణకు హాజరు కాలేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. అయితే పార్లమెంట్ సమావేశాల దృష్ట్యానే సిట్ విచారణకు తాను హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు తాను సిట్ ను నమ్మడం లేదని వివరించారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలుచుకోలేదని వెల్లడించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు నమ్మకం ఉన్న సంస్థలకు మాత్రమే సమాచారం ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని... మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నట్లు వివరించారు. ఈరోజు హాజరుకావాలని కోరినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని.. పార్లమెంట్ సభ్యుడిగా తాను సభకు హాజరు కావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తాను కచ్చితంగా హాజరు కావాలని సిట్ అధికారులు భావిస్తే మరో తేదీ చెప్పాలని.. ఆ రోజు తాను కచ్చితంగా విచారణకు హాజరు అవుతానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం నోటీసులు జారీ చేసిన సిట్..
ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై సోమవారం బండి సంజయ్ చాలెంజ్ చేశారు. మంగళవారం ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను 23వ తేదీన ఆధారాలు తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు బండి సంజయ్ వంతు వచ్చింది.
నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్న బండి సంజయ్..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ తరహాలో.. 30 లక్షల మంది స్టూడెంట్స్ తో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరతామని తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని.. సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. సిట్ నోటీసులివ్వాల్సింది తమకు కాదని.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఇవ్వాలన్నారు. పేపర్ లీక్ కేసుపై ఎవరు మాట్లాడకుండా నోటీసులిస్తున్నారని మండిపడ్డారాయన. 30 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగం చేయడం సర్వసాధారణమా.? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమన్నారు.