Telangana TS Replaced by TG: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలలో రాష్ట్రం కోడ్ అబ్రివేషన్ మార్చడం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోడ్ టీఎస్ గా నిర్ణయించగా, అదే కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో గత డిసెంబర్ లో  ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించింది. గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని డిసైడ్ చేశారు. రాష్ట్రంలో ఇకపై అన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, అటానమస్ సంస్థలు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీ (TS Changed to TG) వాడాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.




వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TG గా మార్పు.. 
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే భావించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మార్చి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సైతం వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో  రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌లో తెలంగాణ కోడ్‌ను టీజీగా మారింది. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రావడంతో వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంబంధిత అంశాలలో రాష్ట్రం కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారిపోయింది.


ఇకనుంచి టీజీ లెటర్ ప్యాడ్..
రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణలో ఇప్పటివరకూ అన్ని లెటర్ ప్యాడ్స్, అన్నిచోట్ల ఉన్న టీఎస్ బదులుగా టీజీగా మారిపోయింది. ఎలక్ట్రానిక్ తో పాటు హార్డ్ కాపీలలోనూ TS బదులుగా TG వాడాలని తాజా ఉత్వర్వులలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖలు, విభాగాలలో టీజీగా అప్ డేట్ కావాలని కార్యదర్శులకు సీఎస్ శాంతికుమారి సూచించారు. ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు రాష్ట్ర కోడ్ అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీ మార్చడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మార్పులు చేర్పులు చేశారన్న దానిపై మే 31 సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీకి నివేదించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.