Seethakka Visits Medaram: మేడారం: ములుగు జిల్లా మేడారం జాతర పనుల పరిశీలనకు వెళ్తున్న రాష్ట్ర పంచాయతీ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (TS Minister Seethakka)కు విచిత్ర అనుభవం ఎదురయింది. సీతక్క మేడారానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో విహార యాత్రకు వచ్చిన పాఠశాల విద్యార్థులు మంత్రి సీతక్కను గమనించారు. వెంటనే సీతక్క, సీతక్క... అంటూ కేకలు వేశారు. దీంతో మంత్రి సీతక్క వెంటనే తన వాహనం దిగి విద్యార్థుల బస్సు ఎక్కారు. సీతక్క బస్సులోకి వెళ్ళగానే జై బోలో సీతక్క అంటూ విద్యార్థులు కేకలు వేశారు. విద్యార్థులను మహిళా మంత్రి ఆప్యాయంగా పలకరించింది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని పలకరించడంతో హైదరాబాద్ మణికొండకు చెందిన ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులమని విద్యార్థులు చెప్పారు. 


విద్యార్థులకు దిశా నిర్దేశం
సీతక్క నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాని వారితో అన్నారు. సీతక్క మీ అభిమాని అంటూ ఒకరు... సమ్మక్క సారక్క సీతక్క అని ఇంకొకరు కేకలు వేయడంతో సీతక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సీతక్క పిల్లలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తును ఎన్నుకునే సమయం ఇది అని సరైన మార్గంలో వెళ్లాలని సీతక్క విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి పూర్తయి ఇంటర్లోకి వెళ్లగానే రకరకాల ఆలోచనలు మార్పులు వస్తాయని వాటిని లెక్క చేయకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని విద్యార్థులకు చెప్పారు. సమాజంలో రకరకాల ప్రలోభాలు, ప్రభావాలకు లొంగకుండా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా భవిష్యత్తులో స్థిరపడాలని సీతక్క విద్యార్థులకు సూచించారు.


మేడారంలో మంత్రి సీతక్క..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం వన దేవతలు సమ్మక్క సారలమ్మలను మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. సీతక్క వన్నె దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం జాతరలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి మేడారం జాతర ను విజయవంతం చేయాలనే లక్ష్యంతో జాతర కు 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నిధుల కేటాయింపు పనుల పూర్తి వివిధ అంశాలతో సీతక్క జాతరలోని అనేక ప్రాంతాలను సందర్శించి అధికారుల నుంచి వివరాలను సేకరించింది.


మేడారం జాతర పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. గోవిందరావు పేట మండలం లోని పసర గుండ్ల వాగు బ్రిడ్జి, దయ్యలవాగు సమీపంలో ఉన్న రోడ్డు, చింతల్ క్రాస్ వద్ద రోడ్డును.. పార్కింగ్ స్థలాలను సీతక్క సందర్శించారు. అనంతరం ఉరాట్టం బ్రిడ్జి, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అదే విధంగా చిలుకల గుట్ట, విఐపి పార్కింగ్ బస్ స్టాండ్‌ను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మేడారం జాతర పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.