ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లా కురిసిన వడగండ్ల వానకు పంటనష్ట పోయిన రైతులకు నేనున్నానని భరోసా కల్పించారు సీఎం KCR.  హెలికాప్టర్‌ ద్వారా వర్ష ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రామాపురంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో పర్యటించారు. అక్కడి నుంచి మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో పంటలను పరిశీలించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 


రైతులకు సీఎం కేసీఆర్ ఏమని భరోసా ఇచ్చారంటే-


ఎన్నిసార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా కేంద్రం మనకు పైసా ఇవ్వలేదు. భారీ పెట్టుబడులతో ప్రాజెక్టులు పూర్తి చేశాం,చేస్తున్నాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే రైతు అనుకూలం ప్రభుత్వం తెలంగాణలోనే ఉన్నది. రైతులకు అండగా ఉన్నాం. రైతు కేంద్రంగా పథకాలు పెట్టి, కాస్తలో కాస్త ఒడ్డున పడేశాం.  అప్పుల నుంచి తెరుకుంటున్నాం. గర్వంగా చెబుతున్నాను.. తెలంగాణలో ఉన్నది రైతు ప్రభుత్వమని. కొందరు మూర్ఖులున్నారు. వ్యవసాయమే దండగ అన్నారు. వ్యవసాయం నుంచి ఆదాయం రాదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. మూడున్నరల లక్షలు.  ఇందులో వ్యవసాయం పాత్ర ముఖ్యమైంది. సరాసరిన 19 శాతం ఆదాయం వ్యవసాయం, దాని అనుబంధరంగాల నుంచి వస్తున్నది. అనేకమందికి ఉపాధి, ఉద్యోగం కల్పించింది వ్యవసాయం.- KCR


దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం రావాలి !


భారతదేశం మొత్తం 50 లక్షల ఎకరాల్లో వరి పండుతుంటే, అందులో తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో వరిపంట సాగవుతోంది. కాబట్టి రైతులు అధైర్యపడొద్దు. విచారం చెందవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ పంటకు మేం పరిహారం చెల్లిస్తాం. కేంద్రం ఇచ్చినా , ఇవ్వకున్నా మేం ఉన్నాం. ఇక్కడ ఉన్నది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. దేశంలో అడ్డుగోలు వ్యవస్థలున్నాయి. ఒక విధానం అంటూ ఏదీ లేదు. ఇన్షూరెన్స్ కంపెనీలకు లాభం తప్ప, రైతుకు మేలు జరుగదు. కేంద్రం బృందాలు ఎప్పటికో వస్తాయి. కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. ఇండియాకు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ కావాలి మేం వర్కవుట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వల్లే అది సాధ్యమవుతుంది. ఇపుడున్న కేంద్రం మరీ దారుణం. వాళ్లకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కేంద్రానికి రాజకీయాలు తప్ప , ప్రజలు, రైతులు పట్టరు. గతంలో పంపిన నష్టం తాలూకు పైసా ఇవ్వలేదు. అందుకే మేం రైతుకు నేరుగా సాయం చేస్తాం. ఎకరాకు రూ. పదివేలు సాయం చేస్తాం. కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయించాం. అందుకోసం రూ. 228 కోట్లు మంజూరు చేస్తున్నాం- KCR


ప్రతి ఎకరాకు రూ. పది వేలు 


గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో 2, 22 250 ఎకరాల్లో నష్టం కలిగింది. ముఖ్యంగా మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు 17, 238 ఎకరాల్లో నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం కోడ్ ప్రకారం రైతులకు పెద్దగా ఏం రాదు. అందుకే మేమే ఎకరానికి రూ. 10వేల పంటనష్టం కింద సాయం చేయాలని నిర్ణయించాం. రైతులు ఏమాత్రం నిరాశకు గురికావద్దని మనవి. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. ఈ దేశంలో ఓ పద్దతీ, పాడూ లేదు. పంట నష్టం జరిగితే రైతులకు లాభాలు పొందడమే బీమా సంస్థల ఉద్దేశం.  పాత కేంద్ర ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమైతే మరీ దారుణం. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉంది. మొత్తం వ్యవసాయ పాలసీని బీఆర్ఎస్ ఇస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితే వస్తే కేంద్రం తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కులు మొరిగినట్లుగా ఉంటున్నది.  దేశంలో రాజకీయాలు తప్ప రైతులు లేరు, ప్రజలు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కేంద్రం ఇచ్చేది మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,332, వరికి రూ.5,400, మామిడితోటలు ధ్వంసం అయితే రూ.7,200. ఇవి ఏ మూలకు కూడా సరిపోదు.  అందుకని దేశంలోనే మొదటిసారిగా సహాయ పునరావాస చర్యల కింద తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలను అందించాలని నిర్ణయించింది. కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలు జారీ చేస్తాం.- KCR


 


దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటును, రైతుబంధు సాయం చేస్తున్నాం. మంచి ప్రగతిదశలోకి వెళ్లే సమయం ఇది. అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగులో ఉంది. వ్యవసాయంలో మంచి వృద్ధిలోకి వచ్చాం. మన రైతులు కూడా ఇప్పుడిప్పుడే అప్పుల నుంచి బయటపడుతున్నారు. అనుకోకుండా రాళ్లవాన వచ్చింది. హైదరాబాద్ నుంచే ప్రకటన చేయవచ్చు. వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3 వేలే ఇస్తారు.    కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశాం. నేను స్వతహాగా రైతును, మట్టిలోపుట్టి మట్టిలో పెరిగాను. వ్యవసాయం బాధలు నాకూ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వెనక పడనీయవద్దు.అవసరమైతే ఇంకో పదెకరాలు ఎక్కువ పండించాలి. ఇంతఎండలో ఇంతదూరం మొత్తం రాష్ట్ర, జిల్లా అధికారులు, నాయకులందరం రైతులకు ధైర్యం చెప్పడానికే వచ్చాం. -KCR


 


చొప్పదండి నియోజకవర్గంలో గతంలో కరువు తాండవించేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో కరువు దూరమైంది. దేశంమొత్తంలోనే తెలంగాణ వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది.  కేంద్ర లెక్కల ప్రకారం నష్టపరిహారం చాలా తక్కువగా ఇస్తారు. దేశచరిత్రలోనే మొదటిసారిగా ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం. కేంద్రంలో చెప్పినా వినేవాడు లేడు. అందుకే రాష్ట్ర నిధుల నుండి రైతులకు పరిహారం అందిస్తున్నాం. ఇంకా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు జాగ్రతగా ఉండాలి. మా రైతులను మేమే వందశాతం కాపాడుకుంటాం. -KCR