తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. గురువారం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.  ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని తెలిపారు.


 






తెలంగాణ బిల్లుపై ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోష‌న్‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.  స‌భా హ‌క్కుల నోటీసు అందింద‌ని దానిపై చైర్మెన్ వెంక‌య్య నిర్ణ‌యం తీసుకుంటార‌ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. చైర్మెన్ ప‌రిశీల‌న కోసం ప్రివిలేజ్ నోటీసును పంపిన‌ట్లు ఆయ‌న చెప్పారు.


 కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌కు మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు అయితే డిప్యూటీ చైర్మన్ సమాధానంతో  టీఆర్ఎస్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. ప్రివిలేజ్‌ నోటీసుపై ఛైర్మన్‌ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లకూడదని నిర్ణయించి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలోనూ ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు డిసైడయ్యారు.  ప్రివిలేజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే వరకు సభను బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.  


పార్లమెంటులో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.  అయితే అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాల్సింది కేసీఆర్‌పైనేనని బీజేపీఎంపీ అరవింద్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ కించపరిచారని .. రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే కేసీఆర్ ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీపై ప్రివిలేజ్ కాదు ముందు కేసీఆర్‌పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ చంద్రుడు లాంటి వారని... ఆయనపై ఉమ్మి వేస్తే అది తిరిగి కేసీఆర్‌పైనే పడుతుందని వ్యాఖ్యలు చేశారు.