JCB Garlands Banned Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భజన సంస్కృతికి, ఆడంబరాలకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక చారిత్రాత్మక , సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో నేతలకు పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు, బుల్డోజర్ల వంటి భారీ యంత్రాలను ఉపయోగించి భారీ గజమాలలు వేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఒక అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, ప్రతి ఒక్కరూ దీనిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంతకంతో విడుదలైన ఈ సర్క్యులర్ లేఖ ప్రకారం.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువల ప్రకారం ఆహార పదార్థాలను వృధా చేయడం సరైన పద్ధతి కాదని, అందుకే పార్టీ నిర్వహించే ఏ చిన్న లేదా పెద్ద కార్యక్రమాల్లోనైనా, ఏ వేదికపైనైనా సరే పాలతో అభిషేకాలు , నీటితో అభిషేకాలు చేయడాన్ని ఖచ్చితంగా నిలిపివేయాలని ఆదేశించారు.
సమాజంలో ఎంతో మంది పోషకాహార లోపం ఎదుర్కొంటున్న తరుణంలో, ఇలా పాలను వృధా చేయడం భావ్యం కాదని టీపీసీసీ ఈ లేఖలో తీవ్రంగా ఆక్షేపించింది. పాలాభిషేకాలు వంటి వృధా పనులకు బదులుగా, పేదలకు, అవసరమున్న వారికి ఆహార పదార్థాలను పంపిణీ చేసే సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసింది. దీనివల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.
ఇక ఇటీవల కాలంలో రాజకీయ సభల్లో పెచ్చుమీరిపోయిన జేసీబీ సంస్కృతిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఉక్కుపాదం మోపింది. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే సమయంలో కొందరు నాయకులు తమ అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జేసీబీలు, బుల్డోజర్లు , ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి భారీ దండలు వేస్తున్నట్లు పార్టీ గుర్తించింది. బుల్డోజర్లు, జేసీబీలు వంటి వాహనాలు అణచివేతకు చిహ్నాలని, అందుకే అలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని స్పష్టం చేస్తూ.. ఈ తరహా ప్రదర్శనలను పూర్తిగా నిషేధించింది.
ఒకవేళ ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా నేతలకు జేసీబీలు, క్రేన్ల ద్వారా గజమాలలు వేయడానికి ప్రయత్నిస్తే, సదరు నాయకులు , కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని టీపీసీసీ గట్టిగా హెచ్చరించింది. ఈ సర్క్యులర్ కాపీలను రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అనుబంధ విభాగాలు, సెల్స్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ పంపిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ నియమాలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని ఆదేశించింది.
