Telangana Assembly Election 2023 Nominations List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఆర్‌ఓల కార్యాలయాలకు వెళ్లారు. మరికొందరు నిరాడంబరంగా నామినేషన్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కని వారు రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. కడపటి సమాచారం అందే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 5,170 మంది నామినేషన్లు వేశారు. తుది ప్రకటన వచ్చాక వీటి సంఖ్య మారే అవకాశం ఉంది
- ఖమ్మం జిల్లాలో 147 మంది అభ్యర్థులు 215 నామినేషన్లు వేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 136 మంది అభ్యర్థులు.. 211 నామినేషన్లు దాఖలు చేశారు.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్‌లో గణేశ్ గుప్తా, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, మద్నూర్‌లో హన్మంత్ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ నామినేషన్లను సమర్పించారు.
- కామారెడ్డి జిల్లాలోని మూడు(కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్) నియోజకవర్గాల్లో మొత్తం 132 మంది అభ్యర్థులు 195 సెట్ల నామినేషన్లు వేశారు.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 237మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 156 నామినేషన్లు దాఖలు చేశారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ గద్వాల బీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు.
- నామినేషన్ చివరి రోజైన శుక్రవారం మెదక్ జిల్లాలో జోరుగా నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. మెదక్ అసెంబ్లీ స్థానానికి 13 మంది అభ్యర్థులు 14 సెట్లు, నర్సాపూర్‌లో 11 మంది అభ్యర్థులు, 15సెట్ల నామినేషన్లు సమర్పించారు. మెదక్‌లో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడం గమనార్హం.
- మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గానికి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 24 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 12 మంది అభ్యర్థులు మొదటిసారిగా నామినేషన్లను రిటర్నింగ్ అధికారి వాడాల రాములుకు అందజేశారు. చెన్నూరు అసెంబ్లీ స్థానానికి 29 మంది అభ్యర్థులు 54 నామపత్రాలు దాఖలు చేశారు. బెల్లంపల్లిలో చివరి రోజు 20 మంది అభ్యర్థులు 26 నామపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 25 మంది అభ్యర్థులు 46 నామినేషన్లు వేశారు.
- జనగామలో ఈ నెల 9వ తేదీ వరకు 13 మంది 22 నామినేషన్లను సమర్పించగా, చివరి రోజు 19 మంది 35 సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. ప్రధాన, ఇతర పార్టీలు, స్వతంత్రులు మొత్తం 32 మంది పోటీకి ముందుకొచ్చారు. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు పరుగులు తీశారు.
- వికారాబాద్ జిల్లాలో చివరి రోజు మొత్తం 146 నామినేషన్లు పత్రాలు దాఖలయ్యాయి. అధికంగా గతంలో దాఖలు చేసిన అభ్యర్థులే మరో సెట్టు సమర్పించారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచేందుకు మొత్తం 307 మంది అభ్యర్థులు 568 సెట్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల తరపున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామపత్రాల్ని ఎన్నికల అధికారికి అందజేశారు. గుర్తింపు పొందిన పార్టీల తరఫున కొందరు, స్వతంత్రులు నామినేషన్లు వేశారు. గురువారం వరకు 187 మంది నామినేషన్లు వేయగా.. చివరి రోజున ఏకంగా 119 మంది కొత్తగా పత్రాలను సమర్పించారు.
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 428 మంది నామినేషన్ వేశారు. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మొత్తం 154 మంది అభ్యర్థులు 265 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 72 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 82 మంది నామపత్రాలు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి అధికంగా నామినేషన్లు వచ్చాయి.
ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. సరిగా లేనివాటిని అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత మిగిలిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారు.