Top 10 News On 18th March:


1. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు


తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో రానున్న 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. 


2. జగిత్యాలకు ప్రధాని మోదీ


ప్రధాని మోదీ జగిత్యాలలో సోమవారం పర్యటించనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాలకు కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొననున్నారు. మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు, కేంద్ర బలగాల సమన్వయంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం మోదీ హైదరాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.


3. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త


ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సోమవారం సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కవితను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని.. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. అటు, కవితను ఈడీ రెండో రోజు విచారించనుంది. తొలి రోజు విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. కాగా, ఆదివారం కవితను ఆమె భర్త అనిల్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు కలిశారు.


4. బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


బీఎస్పీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవారం గులాబీ గూటికి చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. 'తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను.' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఆయన బీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.


5. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి టెన్త్ పరీక్షలు


తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మార్చి 18) నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు, తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు  పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో 7,25,620 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. అటు తెలంగాణలో దాదాపు 5,08,385 మంది పరీక్షలు రాయనున్నారు.


6. ఏపీలో ఒంటిపూట బడులు


ఏపీలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ.. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ తరగతులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.


7. ఎలక్టోరల్ బాండ్స్ కొత్త డేటా విడుదల


ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి మరికొన్ని వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీల నుంచి సేకరించిన వివరాల్ని వెలువరించింది. ఇప్పటికే సీల్డ్‌ కవర్స్‌లో వీటిని సుప్రీంకోర్టుకి సమర్పించింది. ఇవి 2019 ఏప్రిల్ 12వ తేదీ కన్నా ముందు వివరాలు అని తెలుస్తోంది. అంతకు ముందు సుప్రీంకోర్టుకి సమర్పించిన ఫిజికల్ కాపీస్‌ని రిజిస్ట్రీ ఈసీకి తిరిగి ఇచ్చింది. వీటితో పాటు డిజిటలైజ్డ్ రికార్డ్‌, పెన్‌డ్రైవ్‌నీ అందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ డిజిటలైజ్డ్ డేటాని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.


8. మంత్రివర్గ సహచరులకు ప్రధాని కీలక సూచన


వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామన్న భరోసాతో ఉన్న ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు కీలక నిర్దేశం చేశారు. ఎన్నికల అనంతరం తొలి వంద రోజులకు, ఆ తర్వాత రాబోయే ఐదేళ్ల అభివృద్ధికి కొత్త ప్రభుత్వ రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో.. ఆయా మంత్రివర్గ శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమై మెరుగైన కార్యాచరణ ఎజెండాపై చర్చలు జరపాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


9. నేటి నుంచి ఐపీఎల్ టికెట్ల విక్రయం


క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 17 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి సోమవారం ఉదయం 9:30 నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. టికెట్స్ ను పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే, ఒక్కరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. టికెట్ ధరలు రూ.1700 నుంచి రూ.7,500 వరకూ ఉన్నాయి.


10. రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్


రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ ఘన విజయం సాధించారు.  ఈ నెల 15న ప్రారంభమైన పోలింగ్ 17న ముగిసింది. ఆయనకు దాదాపు 88 శాతం ఓట్లు లభించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుతిన్ తో కలిసి నలుగురు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.