TS News Developments Today :  నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మార్కండేయ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చి  తట్ట మట్టి తీయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగం జనార్థన్ పై  బీఆరెస్ నేతల దాడిపై నిన్న జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. అంతేకాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడాన్ని ఖండించారు. మహిళ సర్పంచ్ ను అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కేసు పెట్టారని, నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై అప్పట్లోనే డీజీపీ కూడా ముఖ్య నాయకులం ఫిర్యాదు చేశామన్నారు. అయినా ప్రభుత్వం తన తప్పు దిద్దుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో ఆదివారం దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడించారు. 


గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్, ఎన్. ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్  కార్యవర్గాలతో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు సమావేశం అవుతున్నారు. ఇవాళ ఉదయం కొంతమంది ముఖ్య నాయకులతో వ్యక్తిగత భేటీలు నిర్వహిస్తారు. మధ్నాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ తిలకిస్తారు. అనంతరం నాగర్ కర్నూల్ లో సాయంత్రం  జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. 


నేడు హైదరాబాద్ రానున్న చేగువేరా కూతురు మనుమరాలు,  రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ


క్యూబా విప్లవయోధుడు చే గువేరా కూతురు డాక్టర్‌ అలైదా గువేరా, మనుమరాలు ప్రొఫెసర్‌ ఎస్తేఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్‌ రానున్నారు. తమ పర్యటనలో భాగంగా సాయంత్రం రవీంధ్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగా వారికి పౌరసన్మానం కూడా ఉంటుంది. నేషనల్‌ కమిటీఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా (ఐప్సో) నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అలైదా, ఎస్తేఫానియా సీపీఐ కార్యాలయం మఖ్దూంభవన్‌ను సందర్శిస్తారు. క్యూబా యోధుడు చే గువేరా అంటే రాజకీయాలకు అతీతంగా అభిమానులు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఆయన కూతురు, మనుమరాలు రాకను స్వాగతిస్తూ రవీంధ్రభారతి వద్ద ఫ్లెక్సీలు, కటౌట్‌లు పెట్టడం విశేషం.


అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు, ప్రారంభమైన జాతర


ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. శనివారం ఉదయం 11 నుంచి అర్ధరాత్రి 12 వరకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ముందుగా మైసమ్మ దేవతకు.. ఆ తర్వాత నాగోబా, సతీ, బాన్‌ దేవతలకు మొక్కుకున్నారు. 22 కితలకు చెందిన మెస్రం వంశీయుల మహిళలకు మట్టికుండలు పెద్దల చేతులమీదుగా పంపిణీ చేశారు. గోవాడ్‌లో ప్రవేశం చేసిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసి మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని తయారు చేశారు. మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించారు. రాత్రి 10 గంటల తర్వాత వెలిగించిన కాగడాలతో గోవాడ్‌ నుంచి నాగోబా ఆలయానికి వాయిద్యాలు వాయిస్తూ చేరుకున్నారు. ఈ నెల 28 వరకు జాతర కొనసాగనుండగా, ఉమ్మడి జిల్లా నుంచేగాక వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు.


నేటి నుంచి భాషా పండితుల దశల వారీ ఆందోళన


భాషా పండితులకు పదోన్నతులు లభించే వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పండిత ఐకాస నిర్ణయించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, రేపు కలెక్టర్లు, డీఈఓలను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని ఐకాస నేతలు  సమావేశమై నిర్ణయించారు. ఈ నెల 23న మరోసారి సమీక్షించి పూర్తిస్థాయి ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు జగదీష్‌, చక్రవర్తుల శ్రీనివాస్‌, అబ్దుల్లా, నర్సిములు పాల్గొన్నారు.