నేటి నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు.. 9 జిల్లాల్లోని గర్భిణులకు పంపిణీ..


తెలంగాణ ప్ర‌భుత్వం చాలెంజింగ్‌గా తీసుకుని బాలింత‌లు, గ‌ర్భిణుల్లో పోషాకాహార లోపాన్ని లేకుండా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో గ‌ర్భిణులు, బాలింత‌లు న్యూట్రీష‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఇది చాలా బాధాక‌రం అని మంత్రి కేటీఆర్‌కు ఓ వ్య‌క్తి చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. మూడు నెలల్లో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌ని మాట ఇచ్చారు. కేటీఆర్ చెప్పిన ప్ర‌కారం.. తెలంగాణ వ్యాప్తంగా న్యూట్రిష‌న్ కిట్లు ఉచితంగా అందించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేసింది. రూ. 50 కోట్లతో గర్బిణులకు ఉచితంగా ఈ కిట్లు అంద‌జేయ‌నున్నారు. తొలుత 9 జిల్లాల్లో పంపిణీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని తొలుత కామారెడ్డి నుంచి ఆరోగ్య‌ మంత్రి హ‌రీశ్‌రావు వర్చువల్ ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ల‌ను అంద‌జేయ‌నున్నారు. ఈ కిట్ల‌లో ప్ర‌ధానంగా .. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉండేలా చూశారు. పోషకాహారం ద్వారా వీటిని అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్ కు రూ.1962 తో రూపొందించి, కిట్లను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.


న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి..


కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
కిలో ఖర్జూర
ఐరన్ సిరప్ 3 బాటిల్స్
500 గ్రాముల నెయ్యి
ఆల్బెండజోల్ టాబ్లెట్
కప్పు
ప్లాస్టిక్ బాస్కెట్


నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు


హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందువ్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.


నేడు ఈ జంక్షన్ల వైపు వెళ్లొద్దు


మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్‌ కంట్రోల్‌ రూం, బషీర్‌బాగ్‌, బీజేఆర్‌ విగ్రహం సర్కిల్‌, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్‌ సర్కిల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, నాంపల్లి, కేఎల్‌కే బిల్డింగ్‌, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్‌, హైదర్‌గూడ జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిదని అదనపు సీపీ తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్‌ వైపు కాకుండా.. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి. పార్కింగ్‌ స్థలాలను అందుబాటులో ఉంచామని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వాహనాలను పార్క్‌ చేయాలని పోలీసులు సూచించారు.


నేడు హైదరాబాద్ వార్షిక క్రైమ్ రిపోర్ట్


హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2022-2023 వార్షిక క్రైం నివేదికను ఈ రోజు నగర్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించనున్నారు. ఈ ఏడాది పొడవును జరిగిన క్రైమ్ సంబంధించిన వివరాలు, పొలీసుల తీరు, నగరంలో ట్రాఫిక్ విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు, క్రైం ను అరికట్టడంలో పోలీసులు అనుసరించిన వ్వూహాలను ఆయన ఈ రోజు ఉదయం జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేయనున్నారు. 


నేడు ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పున:నిర్మాణసభ, హాజరు కానున్న చంద్రబాబు


తెలంగాణ తెలుగుదేశంపార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మంలో భారీ భహిరంగసభ జరనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. ఆతర్వాత పొలిటికల్ యాక్టివిటీ బాగా తగ్గింది. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాాల్గొనలేదు. 


నేడు డిపార్ట్మెంటల్ టెస్ట్


 హైదరాబాద్ నాంపల్లి ఎంజే రోడ్డులోని ప్రతిభా భవన్లో బుధవారం డిపార్ట్మెంటల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు టీఎ సీపీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు.


టీఎల్ఎం మేళాల నిర్వహణపై నేడు టెలికాన్ఫరెన్స్


ఐదో తరగతిలోపు విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధనకు చేపట్టిన తొలిమెట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల విద్యాశాఖ.. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాలను నిర్వహించనున్నది. మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ మేళాల నిర్వహణపై సబ్జెక్టుల వారీగా టీచర్లకు అవగాహన కల్పించడానికి బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీశాట్ విద్య చానల్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టుఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల టీచర్లంతా ఈ టెలికాన్ఫరెన్స్ పాల్గొనాలని సూచించారు.


నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏనుమాముల పోలీస్ స్టేషన్ ను నేడు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇల్లందు క్లబ్ హౌజ్ లో కేసిఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం, ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే మొబైల్ టిఫిన్ సెంటర్లను లబ్ది దారులకు పంపిణీ ,మధ్యాహ్నం 2 గంటలకు ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర సమీక్ష సమావేశం నిర్వహించానున్నారు. సాయంత్రం 4 గంటలకు తొర్రూరులో ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.


టీడీపీ శంఖారావం పేరిట బహిరంగ సభ


ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానం వేదికగా ‘టీడీపీ శంఖారావం’ పేరిట నేడు నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత తొలిసారి జరిగే సభను తెదేపా నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, జెండాలతో ఖమ్మం నగరం పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లోని 25 శాసనసభ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను అత్యధిక సంఖ్యలో సభకు తరలించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం భారీ వాహన శ్రేణిలో ర్యాలీగా బహిరంగ సభకు చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ముఖ్య నేతలు రానున్నారు. ఖమ్మం నగరంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతారు. మయూరి సెంటర్‌ నుంచి ఓపెన్‌ టాప్‌ వాహనంలో చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. అక్కడి నుంచి బహిరంగ సభాస్థలికి చేరుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.