Just In





TSRTC Bill: కార్మిక సంఘాలతో గవర్నర్ చర్చలు- సానుకూలంగా స్పందించారన్న నాయకులు
TSRTC Bill: ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వ వివరణ ఇంకా అందలేదని, అది అందిన వెంటనే ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై చెప్పినట్లు టీఎంయూ నేత థామస్ రెడ్డి తెలిపారు.

TSRTC Bill: ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వ వివరణ ఇంకా అందలేదని, అది అందిన వెంటనే ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై చెప్పినట్లు టీఎంయూ నేత థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంపై గవర్నర్ తమిళిసైతో టీఎంయూ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై గవర్నర్, టీఎంయూ నేతలు చర్చించారు.
అనంతరం థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు విజయవంతంగా ముగిశాయన్నారు. బిల్లు ఆమోదించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. తమ సమస్యలను గవర్నర్ విన్నారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వ వివరణ తనకు ఇంకా అందలేదని.. వివరణ అందిన తర్వాత బిల్లు ఆమోదిస్తానని గవర్నర్ చెప్పినట్లు పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ చెప్పారని తెలిపారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఉదయం నుంచి ఆందోళన
తెలంగాణ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఆమోదించలేదని గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కార్మిక సంఘాలు. ఉదయం నల్ల బ్యాడ్జీలతో బస్‌లను నలిపివేసి ఆయా డిపోల వద్ద ధర్నాలు చేపట్టిన కార్మికులు ఇప్పుడు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాజ్‌భవన్‌కు చేరుకునే వివిధ మార్గాల్లో ముట్టడికి యత్నించారు. దీంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్‌కి చేరుకున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అక్కడి నుంచి కాలినడక రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. 1000 మంది ఉద్యోగులతో పీవీ మార్గ్ వద్ద నిరసన తెలిపారు. రాజ్‌భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకొని వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య తీవ్ర పెనుగులాట సాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ సంఘాలను చర్చలకు పిలిచారు.