Congress News :  బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్లు దక్కదని క్లారిటీ వస్తున్న నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.  BRS మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని విడిపోవడానికి సిద్ధమయ్యారు.  తీగల కృష్ణారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో తన కోడలు అనితతో కలిసి భేటీ అయ్యారు. మహేశ్వరం టిక్కెట్‌పై రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అందుకే తీగల .. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.     తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  మహేశ్వరం టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీగా ఉన్న తీగల అనితారెడ్డి.. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది.                                             
 


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిన చోట…బి‌ఆర్‌ఎస్ లో పోటీచేసి ఓడిన నేతలకు ఇబ్బందులు వచ్చాయి. ఇలా అంతర్గత పోరు మొదలైంది. ఈ క్రమంలోనే మహేశ్వరం నియోజకవర్గంలో రచ్చ పెరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలిచి..బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అలాగే మంత్రి కూడా అయ్యారు. ఇక బి‌ఆర్‌ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తీగల టి‌డి‌పి నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు..2018లో పోటీ చేసి ఓడిపోయారు. సబితా కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో సబితా, తీగల వర్గాలకు పడటం లేదు. అయితే మంత్రిగా ఉన్న సబితాకే మహేశ్వరంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మళ్ళీ ఆమెకే సీటు ఖాయమైంది. దీంతో తీగలకు ఇబ్బందులు మొదలయ్యాయి. 
  


గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సిట్టింగ్‌లకు భారాస టికెట్‌ వచ్చే అవకాశముందనే సంకేతాలు రావడంతో పార్టీ మారడమే మేలని తీగల భావించినట్టు తెలుస్తోంది.                                       


కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, పొంగులేటి, జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కండువా కప్పుకోవడంతో అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తాజాగా మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే తన కోడలు రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్‌ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.