Telangana cabinet expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ విషయంలో రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో మూడు పదవుల్ని మాత్రమే భర్తీ చేయనున్నారు.
ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ వర్గాలకూ స్పష్టత లేదు. రెడ్డి సామాజికవర్గంలో పోటీ తీవ్రంగా ఉండటంతో వారిలో ఎవరికీ అవకాశం కల్పించడం లేదని బీసీ, ఎస్సీ వర్గాల వారికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ పరిధిలో మంత్రులు లేరు. కనీసం ఉమ్మడి జిల్లాకు ఓ మంత్రి పదవి కేటాయించకపోతే సమీకరణాలు సరిగ్గా ఉన్నట్లు కాదు. అందుకే.. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
రేవంత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు మొత్తం పన్నెండు మంది ప్రమాణస్వీకారం చేశారు. ఆ స్థానాలను ఖాళీగా ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఆరు స్థానాలను భర్తీ చేయడానికి చాలా కసరత్తు చేశారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలికి పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని ప్రజల ముందు ఉంచాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. కులాల సమీకరణాలు లెక్కలు వేసుకొని జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు.
ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో కొన్ని జిల్లాల నుంచి ప్రాధాన్యత లేదు. ఆదిలాబాద్ నుంచి సీనియర్‌కు చోటు కల్పించనున్నారు. ఈ అంచనాలతో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి ఖాయంగా కనిపిస్తోంది. రె ఈ మధ్య బీసీలకు 42శాతం కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీంతో ఇప్పుడు చేసే మంత్రివర్గంలో బీసీలకు ఆ మేరకు ప్రాధాన్యత లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిస్తాయి. అందుకే ఆ లెక్కలను కూడా కాంగ్రెస్ చూసుకుంది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో బీసీకి అవకాశం కల్పించనున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ రేసులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముందంజలో ఉన్నారు.
ఆరు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న ప్రచారం జరిగుతోంది. హోంమంత్రి, విద్యా శాఖ మంత్రి కూడా లేరు. కీలక శాఖలన్నింటినీ రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. మరో మూడు మంత్రి పదవుల్నిాఖాళీగా ఉంచడం వల్ల ఆశావహులు.. రెబల్స్ గా మారకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు.