నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాల తరలింపు పై వివాదం నెలకొంది. వ్యర్థాల తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ముక్తల్ సీఐ రామ్ లాల్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.


ఈ కంపెనీ వల్ల గ్రామంలో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కంపెనీ వల్ల గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. దీంతో ఆస్పత్రుల పాలవుతున్నావని ఆవేదన వ్యక్తం చేశారు.  స్థానిక అధికారులకు పలమార్లు ఫిర్యాదు చేసిన గాని ఎవరు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గ్రామస్తుల సమస్యను అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను ఇంకా ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.


నారాయణపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపై గ్రామస్థులు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఉన్న జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ట్యాంకర్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్థులు కట్టెలు, రాళ్లతో పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. గ్రామస్థుల దాడిలో మక్తల్ సీఐ రామ్ లాల్, మరికొంత మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.


అసలేం జరిగింది?


నారాయణ పేట జిల్లాలోని చిత్తనూరు గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న జూరాల ఆగ్రో ఇథనాల్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను చిత్తనూరు గ్రామానికి సమీపంలోని వాగులో పారబోసేందుకు ఓ ట్యాంకర్ ద్వారా తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏక్లాస్ పూర్, చిత్తనూరు గ్రామస్థులు ఈ వ్యర్థాల ట్యాంకర్ ను అడ్డుకున్నారు. వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటుచేయకుండా తమ గ్రామాల సమీపంలోని వాగులు, ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ పంటలు, చెరువుల్లోని నీరు కలుషితం అవుతుందని ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును కూడా తాము వ్యతిరేకించామని గ్రామస్థులు తెలిపారు.


పోలీస్ వాహనానికి నిప్పు


చిత్తనూరు సమీపంలో ఫ్యాక్టరీ వ్యర్థాలను డంప్ చేసేందుకు వచ్చిన ట్యాంకర్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశ్రమ వ్యర్థాలను గ్రామ సమీపంలోని వాగులో వేయొద్దని కోరారు. ఈ విషయంపై గ్రామస్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న గ్రామస్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహంతో గ్రామస్థులు పోలీసులపై తిరగబడ్డారు. గ్రామస్థుల రాళ్ల దాడిలో మక్తల్ సీఐ రాంలాల్ కు తీవ్రగాయాలయ్యాయి. పోలీస్ వెహికల్ కు గ్రామస్థులు నిప్పు పెట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వ్యర్థాలు డంప్ చేస్తున్నారని చెబితే తమపై పోలీసులు అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారని, మహిళలపై కూడా దాడి చేశారని గ్రామస్థులు అన్నారు. చిత్తనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు.