PD ACT Rajasingh : పోలీసులు పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టిన రాజాసింగ్‌కు బయటకు వచ్చేందుకు మరో అవకాశం లభించింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు. గత నెల 25వ తేదీ నుండి రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. 2004 నుండి రాజాసింగ్ పై సుమారు 100కి పైగా కేసులు నమోదయ్యాయి.దీంతో రాజాసింగ్ పై హైద్రాబాద్ పోలీసులు ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు గత నెల 25న తరలించారు. ఆగస్టు 22వ తేదీన రాజాసింగ్ యూట్యూబ్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బీజేపీ నుండి రాజాసింగ్ నుండి సస్పెండ్ చేశారు.
అడ్వయిజరీ బోర్డు అంగీకరిస్తేనే కొనసాగింపు
సాధారణంగా పీడీ యాక్ట్ కేసులు అడ్వైజరీ బోర్డ్ పరిధిలో ఉంటాయి. ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కూడిన అడ్వైజరీ బోర్డ్ పీడీ యాక్ట్ ప్రొసీజర్స్‌ను పరిశీలిస్తుంది. ఈ బోర్డులో చైర్మన్, సభ్యులుగా ఇద్దరు రిటైర్డ్ జడ్జీలు ఉంటారు. పోలీసులు అందించిన పీడీ ప్రతిపాదనలను, కేసుల వివరాలను అడ్వైజరీ బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. పీడీ నమోదైన నెల రోజులలోపు నిందితున్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తుంది. నిందితుని నుంచి వివరాలు తీసుకుంటుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని గుర్తిస్తే పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తుంది. పోలీసులు అందించిన ఆధారాలు నిజమని నిర్ధారణ అయితే ఏడాదికాలం వరకు జైలులోనే నిర్భంధించాలని ఆదేశిస్తుంది. ఇప్పుడు ఈ అడ్వైజరీ బోర్డే రాజాసింగ్ కేసులోనూ విచారణ జరపబోతోంది.
పీడీ యాక్ట్‌ను అడ్వయిజరీ బోర్డు తిరస్కరిస్తే వెంటనే స్వేచ్చ !
పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన వారికి కోర్టులో బెయిల్ వేసుకునే అవకాశాలు ఉండవు. నెల రోజుల వ్యవధిలో అడ్వైజరీ బోర్డు జరిపే మొదటి విచారణ కీలకంగా మారుతుంది. అడ్వయిజరీ బోర్డు ఇచ్చిన ఆదేశాలే జైలుకు ఫైనల్ ఆర్డర్స్ అవుతాయి. ఆ తరువాత పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ నిందితులు అడ్వకేట్ ద్వారా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసే అకాశం ఉంటుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణకు వచ్చిన చాలా కేసుల్లో పీడీ యాక్ట్‌ను ఎత్తివేశారు. హైకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే తప్ప.. పీడీ యాక్ట్ కేసులో ఏడాది పాటు జైలు గోడలకే పరిమితం కావాల్సి వస్తుంది. అడ్వయిజరీ బోర్డు .. పీడీ యాక్ట్ కరెక్ట్ కాదంటే .స్వేచ్చ లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన రాజాసింగ్ కుటుంబసభ్యులు !
ఇప్పటికే రాజాసింగ్ కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై నమోదైన పీడీయాక్ట్‌ను ఎత్తివేసి.. బెయిల్ మంజూరు చేయాలని.. ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేట్టిన హైకోర్ట్ ధర్మాసనం.. మంగళ్‌హాట్ SHO కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.