Kavitha Supreme Court :  మహిళల విచారణపై ఈడీకి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. 24వ తేదీన విచారణ చేపడతామని గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. అయితే అది విచారణకు రాలేదు.  దీనిపై విచార‌ణ ఈ నెల 27వ తేదిన చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది.. వాస్త‌వానికి ఈ పిటిష‌న్ పై ఈ నెల 24న కాకుండా ఈ నెల 27న సుప్రీం కోర్టులో విచారణ జరగవ‌ల‌సి ఉంది.. ఈ పిటీషన్‌పై న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది.  కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీనే విచారిస్తామంటూ మొదట తెలిపిన సిజెఐ ధర్మాసనం ఆ తర్వాత 27వ తేదీకి మార్చింది. 


మూడు సార్లు ఈడీ ఎదుట హాజరైన కవిత.


ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ఇప్ప‌టికే మూడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు… ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె మూడుసార్లు ఈడీ ఎదుట హాజరైన క‌విత వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డమే కాకుండా తన వద్ద ఉన్న 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. కీలక పత్రాలు కూడా సమర్పించారు. అలాగే ఇక‌పై విచార‌ణ‌కు తాను కాకుండా త‌న త‌రుపు న్యాయ‌వాది హాజ‌రయ్యే విధంగా అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ అందుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లను క‌విత ఈడీ అధికారుల‌కు అంద‌జేశారు. విచారణ జరిగిన మూడు సార్లు రాత్రి పొద్దు పోయే వరకూ అధికారులు ప్రశ్నించారు. 


చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఈడీపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ! 


ఈడీ అధికారుల విచారణ తీరును  కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో  పిటిషన్ ద్వారా ప్రశఅనించారు.  నిబంధనల ప్రకారం మహిళను ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న తమ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని కవిత నిన్న పిటిషన్ వేశారు. అందుకే తాను ఈడీ విచారణకు రాలేదని, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు తన న్యాయవాది ద్వారా పంపారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని అన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను  ఉల్లంఘిస్తోందని అన్నారు. అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆమె ఈడీ ఎదుట హాజరయ్యారు. 


ఈడీ విచారణకు మళ్లీ నోటీసులు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం!


గత విచారణ సందర్భంగా ఈడీ  .. తదుపరి విచారణ కూడా ఉంటుందని కవితకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడన్నది మెయిల్ ద్వారా తెలియచేస్తామని ఈడీ అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఒక వేళ ఇంట్లో కానీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ప్రశ్నించవచ్చని చెబితే.. ఇక ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉండదు.  సుప్రీంకోర్టు అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక ఈడీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లాల్సి ఉంటుంది.