Telangana Elections: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు పేర్ల టెన్షన్ తప్పడం లేదు. బీఆర్ఎస్ పేరును పోలి ఉన్న టీఆర్ఎస్ పార్టీ కలవరపెడుతోంది. గతంలో కారు గుర్తును పోలిన గుర్తులను వివిధ పార్టీలకు ఈసీ కేటాయించడం బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కలిగించింది. గతంలో హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల సమయంలో పోటీలోకి దిగిన వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కారు గుర్తుతో పోలి ఉన్న రోడ్డు రోలర్ లాంటి గుర్తులను ఈసీ కేటాయించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులను బీఆర్ఎస్ ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను అదే పేరుతో కలిగి ఉన్న పార్టీ పేర్లు గుబులు పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా మార్చిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమతి) పేరుతో సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ పేరుకు ఈసీ కూడా గతంలో ఆమోదం తెలిపింది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల సింబల్ కోసం ఈసీకి గతంలో దరఖాస్తు పెట్టుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయనున్న కొత్త పార్టీలకు ఈసీ సింబల్స్ గురువారం కేటాయించింది.
టీఆర్ఎస్ పార్టీకి వంట గ్యాస్ సిలిండర్ గుర్తును కామన్ సింబల్‌గా ఈసీ కేటాయించింది. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పేరు ఒకేలా ఉండటం, టీఆర్ఎస్ కూడా పోటీ చేయనుండటంతో ఓటర్లు కన్‌ప్యూజ్ అయ్యే అవకాశముంటుంది. పేరు ఒకేలా ఉండటంతో ఒక పార్టీకి ఒటు వేయబోయి మరో పార్టీకి ఓటు వేసే ఛాన్సులు కూడా ఉంటాయి. దీంతో ఈ పరిణామం బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. గతంలో ఎన్నికల సింబల్స్ వల్ల బీఆర్ఎస్ చిక్కులు ఎదుర్కోగా.. ఇప్పుడు ఏకంగా పేరు వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పేరుపై కన్‌ప్యూజ్ కాకుండా ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే.. బాలరంగం ఆ పార్టీని స్థాపించారు. ఆయన భార్య సర్పంచ్, జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన కోడలు కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. బాలరంగం గతంలో కేసీఆర్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ను వ్యతిరేకించి బయటకు వచ్చారు. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ పార్టీ వల్ల వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. పేరు ఒకేలా ఉండటం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశముంది. గతంలో ఎన్నికల గుర్తుల సమయంలో బీఆర్ఎస్ కోర్టులను ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. ఎన్నికల గుర్తులు, పేర్ల అంశం ఈసీ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుందని, తాము జోక్యం చేసుకోలేమని కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో మరోసారి కోర్టులను ఆశ్రయించినా బీఆర్ఎస్‌కు రిలీఫ్ దొరికే అవకాశం లేదు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి.