Telangna government crushing Hyderabad middle class home dream :  హైదరాబాద్‌లో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సమీపానికి వెళ్లి ఓ 1000 ఎస్ఎఫ్టీ అపార్టుమెంట్ కొనుక్కోవాలంటే కనీసం కోటి రూపాయలు అవుతోంది. ఇక స్కై స్క్రాపర్లలో అయితే కనీసం రెండు కోట్లు అవుతోంది. ఓ మధ్యతరగతి జీవి .. కోటి పెట్టి ఇల్లు కొనగలరా?. రూ. 50 లక్షలు అయితేనే జీవితాంతం ఈఎంఐ కట్టుకుంటూ ఓ ఇల్లు కొనగలరు?. అలాంటి పరిస్థితుల్లో భూముల రేట్లను వేలం పెట్టి మరీ రికార్డుల మీద రికార్డులు సృష్టించే దిశగా అమ్ముతూంటే.. ఇక మధ్యతరగతికి అందుబాటులో ఇళ్లు ఉంటాయా?

Continues below advertisement


కోకాపేట భూముల ఎఫెక్ట్ హైదరాబాద్ అంతటా !
  
ప్రభుత్వం కోకాపేట్‌లో భూములు వేలం వేస్తోంది. ఒక్క ఎకరానికి 150 కోట్లు దాటిపోతోంది. ఈ ధరలు చూస్తుంటే సామాన్యులకు ఇల్లు కొనడం కలలా మారిపోయింది. ఈ వేలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా లాభం చేస్తున్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు  భూములు కొని లగ్జరీ ఫ్లాట్లు కడుతున్నాయి. కోకాపేటలో ఒక్కో ఫ్లాట్ 4 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఫ్లాట్లు కొనేవాళ్లు కేవలం బాగా సంపాదించే వాళ్లే. కోకాపేట్ ధరలు పెరిగితే దాని పక్కనే ఉన్న మణికొండ, నర్సింగి, గచ్చిబౌలి ధరలు కూడా పెరుగుతాయి. ఆ తెల్లాపూర్, ఆ తర్వాత కొల్లూరు వరకూ ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే కనీసం 1.5 నుంచి 2 కోట్లు కావాలి.  


మధ్యతరగతి గురించి ఆలోచించని ప్రభుత్వం 


ప్రభుత్వానికి వేలం ద్వారా వేల కోట్లు వస్తున్నాయి. ఆ డబ్బుతో రోడ్లు, మెట్రో విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు  చేస్తామని అంటోంది. కానీ పథకాల అమలు కోసమే అని అందరికీ తెలుసు.   ఇప్పుడు హైదరాబాద్‌లో రెండే రకాల ఇళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి – చాలా ఖరీదైన లగ్జరీ ఫ్లాట్లు, లేదా నగరం బయట చాలా దూరంలో ఉండే చిన్న ఫ్లాట్లు. మధ్యలో మధ్యతరగతి వాళ్లకు తగిన ఇళ్లు దాదాపు లేవు.  గతంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాత్రమే ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు కోకాపేట్, గచ్చిబౌలి కూడా అలాంటి స్థాయికి వచ్చేశాయి. ఇక హైదరాబాద్ నగరం మొత్తం మధ్యతరగతి వారికి ఇల్లు లేదు అన్నట్టు మారిపోతోంది. ప్రభుత్వం ఇలాగే వేలాలు పెడుతూ పోతే రేపు మధ్యతరగతి వాళ్లు నగరం బయటకు వెళ్లిపోవాల్సి వస్తుంది. లేదా ఇల్లు కొనే కలనే వదులుకోవాల్సి వస్తుంది. డబ్బు ఉన్నవాళ్లకు హైదరాబాద్ స్వర్గం అయిపోతోంది. డబ్బు లేని వాళ్లకు ఇక్కడ స్థలం లేకుండా పోతోంది.


తక్కువ ధరకు భూములు ఇస్తే అందుబాటు ఇళ్లు నిర్మిస్తామంటున్న బిల్డర్లు


ప్రభుత్వం ఆదాయం మాత్రమే చూసుకుంటోంది. వేలం వల్ల  ఏర్పడే సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పును ఊహించడం లేదు. కొంత మంది బిల్డర్లు భారీగాఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేయడం వల్ల ఆ ప్రభావం హైదరాబాద్ మొత్తం పడుతుంది. రియల్ ఎస్టేట్ భూమ్ ఉందని చెప్పి అన్ని చోట్లా ధరలు పెంచుతారు. గత కొంత కాలంగా ఇదే జరుగుతోంది.  చిన్న బిల్డర్లు.. ఏ సౌకర్యాలు లేని అపార్టుమెంట్లలోనే ఇప్పుడు డబుల్ బెడ్ రూం 70 లక్షలకు అమ్ముతున్నారంటే.. ఇక సామాన్యుడు ఎలా  సొంత ఇంటి కలను నిజం చేసుకోగలడు.  హైదరాబాద్‌లో ఒక్క ఐటీ వర్గం... అది కూడా ఉన్న వైట్ కాలర్ జాబ్స్ చేసే వారికి మాత్రమే ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.  వారి డిమాండ్ పరిమితం. త్వరలో ఈ బూమ్ బద్దలయ్యే అవకాశం ఉంది. మరో వైపు  మధ్యతరగతికి అందుబాటు ధరల ఇళ్లను నిర్మించడానికి సిద్ధమే కానీ.. భూమి తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తే చాలని అంటున్నారు. వందల కోట్లు పెట్టి  భూమి కొని.. తక్కువ ధరలకు ఎలా అమ్ముతామని ప్రశ్నిస్తున్నారు.


ప్రభుత్వం ఆదాయం  కోసమే వేలం వెర్రిగా భూములను వేలం వేస్తే.. ఆ ప్రభావం మధ్యతరగతిపై ఎక్కువగా పడుతోంది. దీనికి పరిష్కారాన్ని ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిందే.