TS Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ- 3.1 కి.మీ మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని వెల్లడించారు.
వచ్చే 3 రోజులు బీ అలర్ట్
తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ అతి భారీ వర్షాలతో పాటు రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిచింది.
హైదరాబాద్ లో భారీ వర్షం
భారీ వర్ష సూచనతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లిలో భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మూసీ నది పొంగింది. మలక్ పేట్ వంతెన వద్ద వరద నీరు భారీగా చేరింది. మూసారంబాగ్ వంతెన పై నుంచి వరద పొంగి ప్రవహిస్తుంది.