TS Voters List : తెలంగాణలో మొత్తం 29,580,736 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ గురువారం తెలిపారు. నవంబర్ 9న ఓటర్ల డ్రాఫ్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)ను ప్రచురించామని వెల్లడించారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు 14,858,887 మంది ఉండగా, మహిళా ఓటర్లు 14,702,391 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో థర్డ్ జెండర్ ఓటర్లు దాదాపు 1654 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 34,891 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని సీఈవో తెలిపారు. ఇతరులు, ఎన్‌ఆర్‌ఐల ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే, రాష్ట్రంలో మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య 29,562,932 అని సీఈవో ప్రకటించారు. 2737 మంది ఎన్నారై ఓటర్లు, 15,067 మంది సర్వీస్ ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారన్నారు.
11 లక్షల ఓట్లు తొలగింపు
రాష్ట్రంలో 18-19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 5న ప్రచురించిన ఎస్ఎస్ఆర్-2021 ఫైనల్ జాబితాలో 30,356,894 ఉన్నారని స్పష్టం చేశారు. తాజా జాబితా SSR 2022లో పలు మార్పులు చేశామన్నారు. ఈ జాబితాలో దాదాపు 3,45,648 మంది కొత్తగా యాడ్ అయ్యారన్నారు. ఓట్ల జాబితాలో నిరంతరం మార్పులు ఉంటాయన్నారు. కొత్త ముసాయిదాలో 11,36,873 మంది ఓటర్లను తొలగించామన్నారు. ఎస్ఎస్ఆర్ 2023 డ్రాఫ్ట్ రోల్ ను నవంబర్ 9న ప్రచురించామని వెల్లడించారు.
రాజకీయ పార్టీలతో సమావేశాలు
క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ప్రజలు తమ దరఖాస్తులను నిర్ణీత ఫారంలో సమర్పించవచ్చని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి పొరపాటున పేరు తొలగిస్తే సదరు వ్యక్తి, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 24 కింద జిల్లా ఎన్నికల అధికారికి నిర్ణీత వ్యవధిలో అంటే 15 రోజులలోపు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈసీ ఆదేశాల మేరకు ప్రతివారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి డీఈవోలు స్వీకరించిన ఫారమ్‌లు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని సీఈవో కోరారు. బీఎల్ఓ లు ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో 5 శాతం తగ్గిన ఓటర్లు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2023 సంవత్సరానికి సంబంధించి ఓటరు ముసాయిదా జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య గతంతో పోల్చితే 5 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవరాల్లో 43,67,020 మంది ఓటర్లు ఉంటే, వారిలో 2,79,630 గుర్తింపు కార్డులను జీహెచ్‌ఎంసీ తొలగించింది. కొత్తగా 59,575 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపింది. పౌరులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా, లేవా అనే విషయాన్ని చెక్ చేసుకునేందుకు www.nvsp.com, www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చన్నారు. కొత్త ఓటర్లు నమోదు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై ఫిర్యాదులు, అభ్యంతరాలను డిసెంబరు 8వ తేదీ లోపు అప్లై చేసుకోవాలన్నారు. 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.