హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి రాష్ట్రంలో 10+2 విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖపై బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రోజుల్లో అవసరాలకు తగినట్లుగా రాష్ట్రంలో విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రాథమిక ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా నర్సరీ నుంచి టెన్ ప్లస్ టూ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Continues below advertisement

నూతన విద్యా విధానం.. క్లాసుల వర్గీకరణ

తెలంగాణలో నూతన విద్యా విధానంలో విద్యార్థులకు బోధన అందించేందుకు తరగతుల వర్గీకరణను సూచించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా నిర్ణయించారు. 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు సెకండరీ విద్యగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆపై 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ (+2) వరకు ఉన్నత విద్యగా పరిగణించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా +2 స్థాయిలో విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధి (Skill Development) పై ఫోకస్ చేస్తామని తెలిపారు.

Continues below advertisement

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పణ

ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలన్నారు. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వీటితో పాటు పాలిటెక్నిక్ కోర్సుల ఆధునికీకరణ ప్రక్రియకు నిధుల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లను ఇకపై అద్దె భవనాల్లో నిర్వహించకూడదని, తక్షణమే సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పేద పిల్లల కలలకు చిరునామాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే మాత్రం ప్రభుత్వాలకు సంకల్పం ఉండాలని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. ఆ సంకల్పంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా నిర్మిస్తున్నామని... కులం, మతం, ప్రాంతం అనే గీతలను చెరిపేస్తూ ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ స్కూళ్లలో చదువుకునే పేదల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా ఇవి నిలవబోతున్నాయన్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా... ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.